జహీరాబాద్, సెప్టెంబర్ 6: తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే లైన్‌కు ఎఫ్ఎల్ఎస్ మంజూరైందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్రాకేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్రాజెక్టు వయ్యం రూ.1,350 కోట్లు ఉందని, ప్రస్తుతం తాండూరు- జహీరాబాద్ (వయా వికారాబాద్) మధ్య దూరాన్ని 65 కిలోమీటర్ల మేర తగించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. రైళ్ల అనుసంధాన్ని బలోపేతం చేసేందుకు రైల్వే శాఖ తెలంగాణలో 15 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) మంజూరు చేసిందని, ఈ లైన్లు 2,647 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్నదని తెలిపారు.
వీటి అంచనా వ్యయం రూ.50,848 కోట్లు ఉందని పేర్కొన్నారు. నిర్మాణ అంచనా వ్యయం రూ.32,695 కోట్లు, 2,588 కిలోమీటర్ల మేరకు డబ్లింగ్, ట్రిప్లింగ్, క్యాడ్రాప్లింగ్ కోసం మరో 11 ప్రాజెక్టులు ఎఫ్ఎల్ఎస్ మంజూరు చేశారని తెలిపారు. కొత్తగా ఫైనల్ చేసిన లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) మంజూరు చేసిన నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో తాండూరు సిమెంట్ క్లస్టరు నుంచి జహీరాబాద్ వరకు ఉన్నదని పేర్కొన్నారు. తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 75 కిలోమీటర్లు దూరం విస్తరించిందని, అంచనా వ్యయం రూ.1,350 కోట్లు, తాండూరు- జహీరాబాద్(వయా వికారాబాద్) ఉన్న దూరాన్ని 65 కిలోమీటర్లు తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఈ లైన్‌తో రైళ్లను వికారాబాద్ మీదుగా నడపడానికి బదులుగా తాండూరు- జహీరాబాద్ మీదగా నడిపే ఆవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా పని చేస్తుందన్నారు. దీనిపాటు సరకు రవాణా రేక్‌లను రెండు దశల్లో సికింద్రాబాద్ వైపు, వాడి వైపు మరింత సౌకర్యవంతంగా తరలించే అవకాశం ఉందన్నారు. మహారాష్ర్ట నుంచి దక్షిణ రాష్ర్టాలకు రాకపోకలు చేసేందుకు ఉపయోగంగా ఉంటుందన్నారు. సిమెంట్ పరిశ్రమలకు లైన్ ఎంతో ఉపయోగం పడుతుందన్నారు. సిమెంట్, క్లిస్కర్ రవాణాతో పాటు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తుందన్నారు.