నర్సాపూర్, ఫిబ్రవరి 6: కాలుష్య కోరల్లోకి నర్సాపూర్ పట్టణం వెళ్తుందంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గుమ్మడిదల, నర్సాపూర్ మండల పరిధిలోని పచ్చటి అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నర్సాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో డంప్‌యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే గనుక జరిగితే అటవీ ప్రాంతంలో కురిసిన వర్షం నీరు డంపింగ్ యార్డు నుంచి నేరుగా నర్సాపూర్ రాయారావు చెరువులోకి చేరుతుంది. దీంతో చెరువులోని నీరు, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతులు సైతం డంపింగ్ యార్డులో తిరిగి ఇండ్ల పరిసర ప్రాంతాల్లో తిరగడంతో జనాలు రోగాల బారిన పడే అవకాశాలున్నాయని ప్రజలు భావిస్తున్నారు. చెరువులో నీరు కలుషితం కావడంతో చేపలు మృత్యువాత పడి మత్స్యకారులు నష్టపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. చెరువు ఆయకట్టు కింద సుమారు వెయ్యి ఎకరాల సాగుభూమి ఉందని, వాటి పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరగబడుతున్న జనం
అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గుమ్మడిదల, నర్సాపూర్ మండలాల ప్రజలు తిరగబడుతున్నారు. రాత్రికి రాత్రి గ్రామాల్లోని ప్రజలను, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి టిప్పర్లలో మట్టిని తీసుకువచ్చి డంపింగ్ యార్డుకు రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ స్థానికులు నిరసనకు దిగారు. వందల మంది పోలీసులను మోహరించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి తీరుతామని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయినా స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డుకొని తీరుతామని నడుం బిగించారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సైతం ప్రభుత్వ ఆగడాలను ఊపేక్షించేది లేదంటూ ప్రజలకు మద్దతుగా నిలిచి అరెస్టు అయ్యారు. ఎంతమందిని అరెస్టు చేసినా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదంటూ గళం విప్పారు. ఉద్యమాన్ని తలపించేలా అఖిలపక్ష నాయకులు సైతం ముందడుగు వేశారు. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన, బంధులతో నర్సాపూర్ మారుమోగింది. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదంటూ ప్రజలు, యువకులు, నాయకులు కదం తొక్కారు.
ఆగని డంపింగ్ యార్డ్ పనులు
ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు డంపింగ్ యార్డు వద్దంటూ నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదు. ఎవరెంత గొడవలు చేసినా, కన్నీరు పెట్టుకున్నా డంపింగ్ యార్డ్ పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రి సమయాల్లో టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకువచ్చి డంపింగ్ యార్డుకు రోడ్డును నిర్మిస్తున్నారు. పగలు డంపింగ్ యార్డు పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఎవరిని అటువైపు రానివ్వకుండా పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు పహారా కాస్తున్నారు.
డంప్‌యార్డు రద్దుచేసే వరకు ఉద్యమిస్తాం
పచ్చని అటవీ ప్రాంతాన్ని కాలుషితం చేసే డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం. డంపింగ్ యార్డ్ వల్ల రోజుకు 200 వాహనాలు రోడ్లపై తిరుగుతాయి. దీంతో ప్రమాదాలు చాలా పెరుగుతాయి. ప్రభుత్వం వెంటనే అనుమతులను రద్దు చేయాలి. ఎన్ని ఇబ్బందులు కలిగినా రైతులను, ప్రజలను కాపాడుకుంటాం. అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తాం. దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా సహకరించి కలిసి రావాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడంతో డంపింగ్ యార్డు నిర్మాణాన్ని ఆపేశాం. కానీ నేడు కాంగ్రెస్ నాయకులు స్పందించడం లేదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ప్రభుత్వానికి మొండి వైఖరి తగదు. – సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే