కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ కృతజ్ఞత సభను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్, బస్‌డిపో, రోడ్లు, మున్సిపాలిటీ వంటివి ఎన్నో తీసుకొచ్చామని గుర్తు చేశారు. అధికారం కోల్పోవడం కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, హరీశ్‌రావు దిశానిర్దేశం మేరకు కష్టపడి పనిచేసి తనను గెలిపించారని
ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
నర్సాపూర్, డిసెంబర్ 13 : పని చేయడమే తప్ప పగలు, ప్రతీకారాలు తెలియని వ్యక్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నర్సాపూర్ లోని ఓ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సం దర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించి మరోసారి నిరూపించారన్నారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారం కోల్పోవడం కేవలం స్పీడ్ బ్రేక్ మాత్రమేనని, అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతారని ఎవరూ ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే గంటలోపే మీ ముందుంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్, బస్‌డిపో, రోడ్లు, మున్సిపాలిటీ తదితర సౌకర్యాలు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మిషన్ భగీరథ నీటితో మహిళల కష్టాలు తీర్చామని, నాణ్యమైన కరెంట్‌ను అందించి రైతన్నలకు అండగా నిలబడ్డామని వెల్లడించారు. రెండు పంటలు పం డేలా ఉచిత విద్యుత్ తీసుకువచ్చామని, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. పింఛన్, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలంగాణ ప్రజలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారన్నారు. బీఆర్ఎస్పై అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజలు నిజాన్ని తెలుసుకుంటారని, పనిమంతులెవరో త్వరలోనే తెలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ అనుకుంటే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారని, తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేశారని పేర్కొన్నారు. హౌసింగ్ స్కామ్‌లపై సీఐటీ ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చిందని, ఒక్కో కాంగ్రెస్ నాయకుడు 40నుంచి 50 ఇండ్లు మింగేశారని ఎద్దేవా చేశారు. సాధించిన తెలంగాణలో కక్షలు, పగలతో ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ పనిమీద దృష్టిపెట్టారన్నారు. బీఆర్ఎస్కు ఒడిదుడుకులు సహజమని గతంలో ఓడి గెలిచామని, పడిలేచామని పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశామన్నారు. సునీతాలక్ష్మారెడ్డి అనుభవజ్ఞురాలైన ఎమ్మెల్యే అని, తోడుగా మదన్‌రెడ్డి ఉంటారని వెల్లడించారు. నియోజకవర్గంలో పుకార్లను పటాపంచలు చేస్తూ హ్యాట్రిక్ విజయం సాధించామని, ఇందుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్రామ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల గొంతుకను వినిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, నాయకులు గాలి అనిల్‌కుమార్, సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని కార్యకర్తలందరినీ ఒక్కతాటిపైకి తేవడంతో విజయం సాధించామని గుర్తుచేశారు. మాజీ ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా తన విజయం కోసం కష్టపడ్డారని తెలిపారు. మన ధైర్యమే కేసీఆర్ బలమని, నిరాశ చెందవద్దని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెస్తామన్నారు.
-మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఓడారని, కేసీఆర్ కాదని మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి ఏడు స్థానాలు గెలవడం సంతోషంగా ఉందన్నారు. గెలుపునకు కృషి చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటుదామని పిలుపునిచ్చారు. ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ నైజం బయటపడుతుందన్నారు. బీఆర్ఎస్కు పునాది రాళ్లు కార్యకర్తలేనని, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.