Sara Tendulkar : క్రికెట్ దిగ్గజం కూతురుగా సారా టెండూల్కర్ (Sara Tendulkar) మనందరికి సుపరిచితమే. లెజెండరీ ఆటగాడు సచిన్ బిడ్డగా ఈ ప్రపంచానికి పరిచయమైన సారా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలలని ‘వెల్నెస్’ రంగంలో అడుగు పెట్టింది వచ్చింది. నిరుడు ముంబైలో తను ‘పిలాటిస్ అకాడమీ’ (Pilates Academy)కి శ్రీకారం చుట్టింది. టీనేజ్ నుంచే బ్యూటీగా పేరొందిన తను చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తానని అంటోంది. ముఖ్యంగా.. తన కాంతులీనే చర్మానికి మూడు చిట్కాలే కారణమని చెబుతోందీ ముద్దుగుమ్మ.
పిలాటిస్ అకాడమీతో యువతకు వెల్నెస్ పాఠాలు బోధిస్తున్న సారా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చర్మ సంరక్షణ కిటుకులను పంచుకుంది. ఈ క్రమంలోనే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్(PCOS)ను అధిగమించిన తీరును వివరించింది. ‘నా చర్మం చాలా సున్నితం. తరచూ మచ్చలు ఏర్పడుతుంటాయి. అందుకని చర్మ సంరక్షణ ఉత్పత్తుల విషయంలో నేను స్పష్టతో ఉంటా. తేలికైన క్లెన్సర్లు, మాయిశ్చరైజర్లు.. కొన్నిరకాల వస్తువులను మాత్రమే ఉపయోగిస్తాను.
అలానే ఎండ తీవ్రత కారణంగా చర్మం పొడిబారకుండా చూసుకుంటా. హైడ్రేట్‌గా ఉండడం కోసం బాగా నీళ్లు తాగుతా. చాలా ఉత్పత్తులు త్వరితగతిన ఫలితాలను ఇస్తాయని మొదట్లో నేనూ నమ్మాను. కానీ, నా చర్మం విషయంలో మాత్రం అలా జరగలేదు. అధికంగా చర్మ సౌందర్య సాధనాల వినియోగం ఆపేశా. నా స్కిన్‌కు సరిపడే పద్ధతులనే పాటిస్తున్నా. రాత్రిపూట నిద్రపోవడానికి ముందు మేకప్‌ను తీసేస్తాను’ అని సారా తెలిపింది.
‘పీసీఓఎస్.. ప్రపంచవ్యాప్తంగా 3 శాతం నుంచి 11 శాతం మందిని వేధిస్తున్న సమస్యతో నేనూ బాధ పడ్డాను. పీసీఓఎస్ వస్తూ వస్తూనే ఏన్నో ఇబ్బందుల్ని తీసుకొచ్చింది. దీని సంకేతాలు చర్మంపై మచ్చల ద్వారా బయటపడుతాయి. ముఖ్యంగా.. చర్మం జిడ్డులా మారడం, పగుళ్లు ఏర్పడడం వంటివి. ఈ సమస్య ఎదురైనప్పుడే నాకు అంతర్గత ఆరోగ్యం, చర్మం ఆరోగ్యం.. ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలిసొచ్చింది. పీసీఓఎస్ సమస్యలు వేధిస్తున్న సమయంలో ఏం చేయాలో తోచక డెర్మటాలజిస్ట్‌ను కలిశాను కూడా. అయితే.. అమ్మ అంజలి సలహాతో నా లైఫ్ మారిపోయింది.
పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, శారీరక ధ్రుఢత్వం కోసం వ్యాయామాలు చేయడం.. సాధారణమైన చర్మ సంరక్షణ పద్ధతులనే పాటించడం అలవర్చుకున్నా. ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్.. చక్కెరతో నిండిన ఆహారపదార్ధాలను తినడం చాలా తగ్గించాను. సమతులాహారం తీసుకోవడం.. చర్మం పొడిబారకుండా సన్‌స్క్రీన్ రాసుకోవడం.. హైడ్రేట్‌గా ఉండేందుకు సరిపోను నీళ్లు తాగడం ద్వారా మంచి ఫలితాలు కనిపించాయి’ అని సారా తన చర్మ రహస్యాన్ని వెల్లడించింది.
తండ్రి క్రికెట్ దిగ్గజమైనా సారా మాత్రం ఆవైపు అడుగేయలేదు. బయోమెడికల్ సైన్స్‌లో డిగ్రీ.. ఆ తర్వాత క్లినికల్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో పీజీ చదివిన తను కొన్నిరోజులు మోడల్‌గానూ మెరిసింది. సామాజిక బాధ్యతలోనూ భాగమవుతూ.. తమ కుటుంబం నిర్వహిస్తున్న సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌గా చేరింది సారా.
ఈసారి పిలాటెస్ అకాడమీతో ఈ తరానికి ఫిట్నెస్, వెల్నెస్ పాఠాలు బోధిస్తోందీ బ్యూటిఫుల్ లేడీ. ఈమధ్యే సోదరుడు అర్జున్ టెండూల్కర్ ముందస్తు పెళ్లి వేడుకల్లో తళుక్కుమందీ క్రికెట్ గాడ్స్ డాటర్. నిరుడు ఆగస్టులోనే ఆంత్రోప్రెన్యూర్ సానియా చందోక్‌తో, అర్జున్ నిశ్చితార్ధం జరిగింది. మార్చి 5న జరుగబోయే వివాహ వేడుకతో ఈ జంట ఒక్కటవ్వనుంది.