శివ్వంపేట, మే 10: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి తాలు, తేమ పేర్లతో కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించడం అన్యాయమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డా రు. ఆదివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండ లం కొత్తపేట్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
పదిహేను రోజుల కింద రైతులు ధాన్యాన్ని తెచ్చినా కాంటా చేయకపోవడం తెలుసుకుని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. రైతులు అంతారం అంజమ్మ, గూడూరు స్వప్న వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. తాను 192 సంచులు వడ్లను విక్రయించగా, తరుగు పేరుతో నాలుగు బస్తాల వరకు కోత పెట్టారని పాండ్యా తండాకు చెందిన రైతు మాలోత్ ప్రవీణ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. పౌరసరఫరాల అధికారితో ఫోన్లో మాట్లాడి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ధాన్యాన్ని తరించాలని అధికారులను ఆదేశించారు. అంత కుముందు మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఉచిత మినరల్ వాటర్‌ప్లాంటు ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్,మాజీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, నాయకులు మర్ర మహేందర్‌గౌడ్, గుంజరి ప్రవీణ్, సర్పంచ్ మహేష్, సత్యనారాయణ, శివకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.