మన పక్కనే ఉన్న కర్ణాటక ప్రజలు కరెంట్, సాగు,తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ వస్తే అలాంటి గోసే మనకు వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నారాయణఖేడ్‌లో సోమవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్‌కు.. బీఆర్ఎస్ పాలనలో ఉన్న నేటి నారాయణఖేడ్‌కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఓటర్లు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నల్లవాగుపై ఎత్తిపోతలు, బసవేశ్వర ఎత్తిపోతలను స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. నారాయణఖేడ్ హీరో భూపాల్‌రెడ్డి అని, ఆయన హయాంలో ఈ ప్రాంతం దశ మారిందన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తనను కలిచివేసిందని సీఎం పేర్కొన్నారు. అంచనాలకు మించి జనం తరలిరావడంతో ‘ప్రజా ఆశీర్వాద’ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఒకరిద్దరు కాదు.. వేలాదిగా జనం రావడంతో సోమవారం నారాయణఖేడ్‌లో గులాబీ జాతర సాగింది. పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. అంచనాలకు మించి జనం రావడంతో సభ జరిగిన మైదానం సరిపోలేదు. గ్రామాలు, తండాల నుంచి అన్నివర్గాల ప్రజలు వచ్చారు. బ్యాండ్‌మేళాలు, గులాబీ జెండాలు చేతబట్టి, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఎంతో ఉత్సాహంగా చేరుకున్నారు. యువత కేసీఆర్ మాస్కులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభా ప్రాంగణం చుట్టూ ఉన్న భవనాల పైకి ఎక్కి ప్రజలు సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ‘రామక్క’ పాటలకు ప్రజలు లేచి నృత్యాలు చేశారు. గులాబీ దండు సందడి చేసింది.
సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ నారాయణఖేడ్, అక్టోబర్ 30: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అంచనాలకు మించి జనం తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది. ప్రజాఆశీర్వాద సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వివిధ కులవృత్తుల వేషధారణలు, గిరిజనుల నృత్యాలతో సబ్బండ వర్గాల ప్రజలు సమూహంగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజాఆశీర్వాద సభకు తరలివచ్చిన జనంతో బీఆర్ఎస్ పార్టీలో నూతనుత్తేజం కనిపించింది. యువత కేసీఆర్ మాస్కులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభా ప్రాంగణం చుట్టూ ఉన్న భవనాలపై నుంచి ప్రజలు సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాములక్క పాటలకు ప్రజలు లేచి నృత్యాలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం యువత కేరింతలు, ప్రజల హర్షద్వానాల మధ్యన కొనసాగింది. సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి 11 నిముషాలపాటు మాట్లాడారు.
ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడినప్పుడు ప్రజలు జై కేసీఆర్ అంటూ పెద్తఎత్తున నినాదాలు చేశారు. కంగ్టి మండలం సర్దార్‌తండాకు చెందిన చిమ్నిబాయిని గుర్తు చేసినప్పుడు, గ్రామాల పేర్లు, మంత్రి హోదాలో ఈ ప్రాంతంలో తిరిగిన సందర్భాలను గుర్తు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. నాడు ఎట్లా ఉండే నేడు ఎట్లా చేసుకున్నాం నారాయణఖేడ్‌ను అని కేసీఆర్ అన్నారు. జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉందన్నారు. నాడు రేకుల డబ్బాల ఇండ్లు ఉండే ఇవ్వాల ఎటు చూసినా రెండు, మూడు అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయన్నారు. హెలిక్యాప్టర్‌లో చూసుకుంటూ వచ్చిన నారాయణఖేడ్ చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాలి. మీ ఎమ్మెల్యే ఎప్పుడూ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతాడు. ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడు. హైదరాబాద్‌లో తక్కువ, ఇక్కడే ఎక్కువ ఉంటాడు. మీ నారాయణఖేడ్ హీరో భూపాల్‌రెడ్డి అన్నప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జిందాబాద్.. హ్యాట్రిక్ సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజాఆశీర్వాద సభకు తరలివచ్చిన జనంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు డైలమాలో పడిపోయాయి. నారాయణఖేడ్‌లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి విజయం ఖాయమైపోయింది.
సభలో సీఎం కేసీఆర్ మహారెడ్డి భూపాల్‌రెడ్డి గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆయన మృదుస్వభావి అని, మంచిమనిషి అని, యువకుడు అని.. ఆయన నారాయణఖేడ్ హీరో అని అనగానే ప్రజల నుంచి పెద్దఎత్తున నినాదాలు వినిపించాయి. అంతకుముందు సభకు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు అభివాదం చేయగానే.. ప్రజలు సైతం జై కేసీఆర్.. జైజై కేసీఆర్… హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ పెద్దఎత్తున నినదించారు.
ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన గిరిజనులు, రైతులు, మహిళలు, యువత, పండుటాకులు ఎర్రటి ఎండను లెక్క చేయలేదు. సీఎం కేసీఆర్ రాక ముందు.. వచ్చిన తర్వాత గంటల పాటు వేచి ఉండి ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో నారాయణఖేడ్ ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ హర్షద్వానాలు చేశారు.