గజ్వేల్, ఆగస్టు 2: మిషన్ భగీరథ పథకం చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్‌దే అని, కేసీఆర్ కృషితోనే గజ్వేల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
శనివారం గజ్వేల్‌లోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.1410కోట్లతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసి కోమటిబండ వరకు 15కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేసిన కేసీఆర్‌కు గజ్వేల్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ జలాభిషేకం చేసినట్లు తెలిపారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.1210 కోట్లతో పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్ చిన్నపాటి పనులను పూర్తి చేయడంలో కాలయాపన చేసిందన్నారు. సమైక్య పాలనలో అప్పటి పాలకులు నీటి సమస్యను పరిష్కరించలేదన్నారు. ఎండాకాలంలో బిందెలతో మహిళలు రోడ్లమీది కొచ్చిన రోజులను కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. కన్నెపల్లి వద్ద ప్రభుత్వం వెంటనే మోటర్లను ఆన్ చేయాలని, ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపి రైతులకు సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.
గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా రైతులపై కక్షకట్టి ప్రాజెక్టులను నింపడం లేదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లను కూడవెల్ల్లి, హల్దీ వాగులోకి వదలడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధు, నవాజ్‌మీరా, కుమార్, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జడ్పీటీసీ మల్లేశం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పాల రమేశ్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్, రవీందర్, పంబాల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.