Collector Rahulraj | మెదక్ రూరల్, అక్టోబర్ 30 : ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. రైతులకు ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో 10, 530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా.. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి.. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతం చూసి కొనుగోలు చేయాలని.. వర్షం వల్ల పూర్తిగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిళ్లకు తరలించాలన్నారు.
వాతావరణం దృష్ట్యా రైతులు కూడా తేమ శాతం వచ్చాకనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొద్దిగా తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు టార్ఫాలిన్లను ఇచ్చి రైతులకు సహకరించాలన్నారు. నవంబర్ మొదటి వారంలో ఇంకా ఎక్కువ దాన్యం వచ్చే అవకాశం ఉంటుందని.. ఈలోగా కేంద్రాలలో ఉన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో వేగవంతంగా జరగాలన్నారు.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తప్పవు..
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో.. అధికారులు కూడా అంతే శ్రద్ధగా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జీపీఓ, స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పర్యవేక్షణ చేయాలని… ప్రతీ కేంద్రంలో మూమెంట్ రిజిస్టర్ పక్కాగా నిర్వహణ జరిగేలా చూడాలన్నారు. అలాగే ప్రతి కేంద్రంలో ఫ్లెక్సీపైన రాష్ట్ర, జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు తప్పక ప్రదర్శించాలన్నారు.
ట్రాక్ షీట్ అప్డేషన్ ఎప్పటికప్పుడు జరగాలని.. ప్రతి కేంద్రంలో కనీస మౌలిక వసతులు ఉండాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన అన్ని ధాన్యం కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. అన్ని ప్రక్రియల నిర్వహణ సరిగ్గా ఉండాలని… నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట హవేలీ ఘన్పూర్ తహసీల్దార్ సింధు రేణుక, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన