పటాన్చెరు, అక్టోబర్ 11: శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ డి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అమీన్‌ఫూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన జిల్లా ఎస్పీ రూపేశ్‌తో కలసి తనిఖీ చేశారు. ఐజీ సత్యనారాయణను అమీన్‌ఫూర్ పోలీసులు గౌరవ వందనం అందజేసి స్వాగతం పలికారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆయన మొక్క నాటారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన మినీ కమాండ్ కంట్రోల్‌ను ఐజీ ప్రారంభించారు. కొన్నేండ్లుగా అమీన్ఫూర్లో నమోదవుతున్న కేసులు, పరిష్కారవుతున్న విధానం, వేగంగా పెరుగుతున్న అర్బన్ అర్బనైజేషన్ ద్వారా ఉత్పన్నమవుతున్న కేసుల గురించి ఆరాతీసి రికార్డులను పరిశీలించారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడారు. రిసెప్షన్లోప్రతి పిటిషన్‌ను ఆన్లైన్ చేయాలని, పోలీసు స్టేషన్‌కు వచ్చినవారితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అనంతరం ఐజీ విలేకరులతో మా ట్లాడారు. అమీన్‌ఫూర్ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను తనిఖీ చేశానని వివరించారు. సైబర్ నేరాల్లో అమీన్‌ఫూర్ మూడో స్థానంలో ఉందన్నారు. శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నందున సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పరిశ్రమల సిబ్బంది, ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడే నివసించేందుకు వస్తున్నారని తెలిపారు.
రియల్ ఎస్ట్టేట్ మోసాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఇతరుల స్థలాలను బలవంతంగా కబ్జాలకు పాల్పడితే పోలీసులు కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సివిల్ వ్యవహారాల్లో పోలీసులు తలదూర్చరాదని, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు, తదితర శాఖలతో కలసి ప్రభుత్వ స్థలాలను కాపాడే వ్యవస్థ ఉందన్నారు. హైడ్రా పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, వారిపై గట్టి నిఘా పెట్టామన్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో మోసం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని ఐజీ సత్యనారాయణ గుర్తు చేశారు.
ఆన్లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టులతోను అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు ఐజీ సత్యనారాయణ సూచించారు. ఆన్లైన్లో లోన్లు తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్‌లో డబ్బు లు పెట్టడం చేయరాదన్నారు. ఎవరూ అయాచితంగా మనకు డబ్బులు ఇవ్వరని గుర్తించాలన్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రతిరోజు మోసాలకు పాల్పడుతున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబరాబాద్, రాచకొండ తరువాత అమీన్‌పూర్‌లోనే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2022లో 122 సైబర్ కేసులు, 20 23లో 158 కేసులు, 2024లో 178 కేసులు నమోదైనట్లు తెలిపారు.
వెలుగు చూడని కేసులు అనేకం ఉంటాయన్నారు. ఆన్లైన్ మోసానికి గురైతే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అమీన్ఫూర్లో 46 కేసుల్లో తక్షణం స్పందించి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఫ్రీజింగ్ చేశామన్నారు. అప్రమత్తతే మీకు మేలు చేస్తుందన్నారు. ఆన్లైన్లో మోసాలపై ప్రజలకు అవగాహన పెంచుతున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ఐజీ చెప్పారు. ఐజీ వెంట ఎస్పీ చెన్నూరి రూపే శ్, అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శేఖర్, ఎస్సైలు విజయ్, సోమేశ్వరి, సిబ్బంది ఉన్నారు.