దుబ్బాక, మే 11 : బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దివ్యాంగులకు చేయూతనిచ్చారు. సొంత డబ్బులతో వారి కోసం ప్రత్యేకంగా త్రీవీలర్ స్కూటీలు కొనుగోలు చేసి అందజేశారు. దుబ్బాక నియోజకవర్గంలో 60 మందికి త్రీవీలర్ స్కూటీలు అందజేయాలని నిర్ణయించారు. తొలి విడతగా గురువారం 10 మంది దివ్యాంగులకు వాటిని అందజేశారు. ఒక్కో త్రీవీలర్ స్కూటీ ఖరీదుకు రూ.1.50 లక్షలు ఉంటుంది. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి చేసిన సాయానికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఒక్కో దివ్యాంగుడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని త్రీవీలర్ స్కూటీ అందించి, వారిలో ధైర్యాన్ని నింపారు.
అనంతరం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… దివ్యాంగులను ఆదుకునేందుకు తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పేదలకు తనవంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదరికంలో ఉన్న 60మంది దివ్యాంగులను గుర్తించి, వారికి త్రీవీలర్ స్కూటీలు అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తొలి విడతగా గురువారం పది మందికి అందజేసినట్లు తెలిపారు. ఇందులో పలువురు విద్యార్థులు, చిరుద్యోగులు, కూలీ పనులు చేసుకునే వారు ఉన్నట్లు తెలిపారు.
ఒక్కో త్రీవీలర్ స్కూటీ రూ.1.50 ఖరీదు ఉంటుందని, వీటిని చక్కగా వినియోగించుకోవాలని దివ్యాంగులను ఆయన కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దివ్యాంగులకు భరోసాగా నిలుస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాసేవ చేసే భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ ఎంపీటీసీ ఆర్.మాధవి, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.