న్యూఢిల్లీ, మార్చి 16 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో అతి విలువైన లోహాల ధరలు పతనం చెందాయి. దీంట్లోభాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,950 తగ్గి రూ.1.60 లక్షలకు దిగొచ్చింది. పుత్తడితోపాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.9 వేలు తగ్గి రూ.2.56 లక్షలకు దిగొచ్చింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌నకు మొగ్గుచూపారని, ఫలితంగా అతి విలువైన లోహాలపై పెట్టుబడులను వెనక్కి తీసుకొని డాలర్లు, బాండ్లను కొనుగోలునకు మొగ్గుచూపారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ దిలీప్ పర్మర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 5 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. చివరకు 20.94 డాలర్లు తగ్గి 4,998.31 డాలర్లకు జారుకున్నది. అలాగే వెండి 80 డాలర్ల దిగువకు పడిపోయింది.