పోటిసునితో పెళ్లి జరిపిస్తానని చంద్రహత్థికి మాట ఇస్తుంది సవరసత్తి. అవణాయరుకు అడ్డంగా దొరికిపోయిన జయసేనుణ్ని దేవి రూపంలోని వామదేవుడు కాపాడుకుంటాడు. ఆనందుణ్ని తన కోడలితో విహారానికి వెళ్లమని ప్రోత్సహిస్తుంది కమలసత్తి. అది నచ్చని ఆహవసత్తి.. కమలసత్తిని నిలదీస్తుంది. తర్వాత…
తనను నిలదీసిన ఆహవకు గట్టి సమాధానం ఇచ్చింది కమల సత్తి… “నీవు అడిగిన ప్రశ్నకు, అడిగిన తీరుకు నీ చెంప పగులగొట్టే అధికారం, పెద్దరికం నాకున్నాయి. అయి నా నేను కొట్టను. అందుకు కారణం మా మీద చెరగని ప్రేమాభిమానాలతో నీవు అందిస్తున్న సేవలే. అంతమాత్రాన నీవు ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకోకు!” అని మందలించి, “ఇంట్లో ముగ్గురం ఆడవాళ్లం ఉన్నాం. మీరు మంచి వయసులో ఉన్నారు. ఉంటున్నది మనకు పరిచయం లేని ఊరు. నేను గుడ్డిదాన్ని. ఊరు ఎంత పెద్దగా ఉందో నాకు తెలవదు కానీ, ఊరు నిండా మగవాళ్లు అయితే ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరి దృష్టి మీ మీదనే ఉంటుంది. మగవాడు ఆడదాని విషయంలో వంచననే ఆశ్రయిస్తాడు. ఉదయం సచ్చసామిని చూడలేదా? ఈరోజు సచ్చసామి; రేపు బుచ్చి స్వామి; ఎల్లుండి మచ్చసామి… ఎవడో ఒకడు! ఎంత మందిని అడ్డుకోగలం? ఎంతమంది నుంచి తప్పించుకోగలం? ఇంట్లో ఆడవాళ్లను కాపాడాలంటే మొలతాడున్న మనిషొకడు కావాలి. వాడు మహావీరుడే కానవసరం లేదు; చేతగానివాడైనా సరే ఒక ఆడదానికి ఒక తోడున్నాడంటే ఇంకొకని డేగ కన్ను వారకు పోతుంది. అందుకే ఆ ఆనందుడు మనకు తోడున్నాడన్న సంగతి ఈ లోకానికి తెలియాలని వాళ్లను ఊళ్లో తిరిగి రమ్మని చెప్పినాను. ఆనందుడు ఉత్తముడు; నా కోడలు కూడా గుణవతే. పరిస్థితులు వాళ్ల మనసులను బలహీనపరిస్తే ఆ పరమేశ్వరుడే కాపాడుతాడు. నీవు తెలివైన దానివి. ఇంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు. మన కువిందుడే బతికి ఉంటే…” “అమ్మా!” అంది చెవులు మూసుకుంటూ, అమంగళం వినలేక అలసుద్ది (ఆహవసత్తి).
“మనం నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం! అతను బతికి ఉంటే ఇంతకాలం మనల్ని ఒంటరిగా ఉండనీయడు! మగదిక్కు లేని మనల్ని సమాజం ప్రశాంతంగా బతకనీయదు!!” గబుక్కున ఆమె కాళ్ల మీద పడ్డది ఆహవ. “అమ్మా! నా అజ్ఞానాన్ని కాయి!” అన్నది కన్నీళ్లతో. ఆహవను దగ్గరికి తీసుకొని, కన్నీళ్లు తుడిచింది కమల. “పిచ్చి పిల్లా! నీ మంచి మనసు నాకు తెలుసు. ఒక్క మాటతోనే అర్థం చేసుకున్నావు కదా! అది చాలు! రోహ నాకు బిడ్డ లాంటిది; నీవూ నా బిడ్డవే! ఆ పోటిసుడు కనిపించనీ… వాని చెవి మెలేసి నీ చేయి వాని చేతిలో పెడతా!” అన్నది. పోటిసుని పేరు ఎత్తగానే అలసుద్ది గుండె పులకించింది. ఆ ఆనందంతో సిరిసత్తిని హత్తుకున్నది. ఊళ్లోని విశేషాలను చూస్తున్న ఆలుమగలు కాని ఆలుమగలు భాణుసత్తి, ఆనందులను అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. భాణు ఆనందంతో ఆనందునితో ఏమేమో మాట్లాడుతున్నది. ఆనందుడు ఈ నాటకంలో తానొక పాత్రను అనే భావిస్తూ, రక్తి కట్టించడానికి తనవంతు ప్రయత్నలోపం లేకుండా నటిస్తున్నాడు. వాళ్లిద్దరూ ఊరి చివరన ఉన్న శివాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం గోడల మీద శిల్పులు రకరకాల శిల్పాలు చెక్కినారు. వాటిని చూస్తూ భాణు ఒకచోట ముందుకు కదలలేక ఆగిపోయింది. ఆమెను అనుసరిస్తున్న ప్రణాలుడు (ఆనందుడు) కూడా ఆగి, ఆ శిల్పకళాఖండాలను గమనిస్తూ ఉన్నాడు. “ఆనందా! ఈ పార్వతీ కళ్యాణం దృశ్యం గమనించినావా?” అన్నది, ఒక కళాఖండం చూపిస్తూ భాణుసత్తి.
“కళ్యాణం అయిపోయిన వారి కంటే, కాని వారు చూస్తేనే అందులోని ఆనందం రెట్టింపు అవుతుందేమో!?” అన్నాడు ముక్తసరిగా, తనకు పట్టనట్లు ఆనందుడు. తనకు కళ్యాణం అయ్యిందన్న సంగతి అతను గుర్తుచేస్తున్నాడని గ్రహించినా, పట్టించుకోకుండా.. “అబ్బా! అది కాదు. అయినా పరమేశ్వర కళ్యాణం ఎవరు చూసినా, ఎప్పుడు చూసినా అందం చెదరదు; ఆనందం తరగదు. ముందుగా ఇందులో నీవు గమనించిన ప్రత్యేకత ఏమిటో చెప్పు చూద్దాం!” అన్నది భాణు. అతనితో అలా విహరించడం ఆమెలో ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతున్నది. ఆమె మాట కాదనలేక ఆ శిల్పాన్ని పరిశీలించి, విశేషాన్ని గ్రహించలేక భుజాలు ఎగరేసినాడు ఆనందుడు. అతను చెప్పలేడని నిర్ధారణ చేసుకొని, తానే ఆ గొప్పతనాన్ని విప్పి చెప్పింది భాణుసత్తి… భయపడునని యెంచి పార్వతి కోసమై పాము కంకణమును పరమశివుడు పాణిగ్రహణ వేళ పైపైకి జరిపెగా! అతని ప్రేమ యెంత అమృతమయము! (శివుడు పార్వతిని పెళ్లాడుతున్నప్పుడు పాణిగ్రహణ సమయం వచ్చింది. పాములే ఆభరణాలుగా గల పరమశివుడు చేతికంకణంగా ఉన్న పామును చూసి పార్వతి భయపడుతుందేమో అనుకొని, దాన్ని పైపైకి జరిపినాడట! పార్వతి అంటే పరమేశ్వరునికి ఎంత ప్రేమ కదా!)”. నిజంగా ఆమె భావనా పటిమను, ఆలోచనలోని పవిత్రతను, తేజస్సును చూసి అతని మనసు మురిసింది. శారీరక సౌందర్యాన్ని మించిన మనసు అందమే మనుషులను మరింత దగ్గరికి చేరుస్తుంది కదా! అనుకుంటూ ఆమె కళ్లలోకి చూసినాడు ఆనందుడు.
మల్లికా గిరి… అహయా దేవి, మేఘచంద్రులు నెల రోజులుగా తిండి సరిగ్గా తినడం లేదు. రోహా చెల్లెలు సీహా కూడా అక్క కోసం ఏడ్చిఏడ్చి, చిక్కి శల్యమైంది. సమయానికి పురోహితుడు కూడా తీర్థయాత్రలకు వెళ్లి ఉండటంతో వాళ్లను ఓదార్చే వాళ్లే కరువైనారు. వీళ్ల పరిస్థితి గురించి విన్న పురోహితుడు తన సొంత ఇంటికి కూడా వెళ్లకుండా కాశీ నుండి సరాసరి మేఘచంద్రుని రాజగృహానికే వచ్చినాడు. అతని రాకతో శిశిరం వసంతమైనట్లు ఆ ఇంటిలో సజీవ చైతన్యం వెల్లివిరిసింది. పనివాళ్లు, భటులు, పరిచారికలు అందరి మొహాలు కళకళలాడినాయి. మేఘచంద్ర దంపతులు పురోహితుని ముందు మోకరిల్లి కన్నీటిపర్యంతమైనారు.“దిగులు చెందకండి! జరిగిందేమిటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. ముందుగా రోహాదేవి జాతక చక్రం తెప్పించండి!” అన్నాడు కూర్చుంటూ. సీహాదేవి తన అక్క రోహా జాతక చక్రం ఉన్న తాళపత్రం తెచ్చి పురోహితునికి ఇచ్చింది. పురోహితుడు పరమేశ్వర శాస్త్రి ఒకటికి రెండుసార్లు గ్రహగతులను లెక్కించి, జాతక చక్రాన్ని పునః పునః పరిశీలించినాడు. “ఎవరు చెప్పినారు మీ బిడ్డ చనిపోయిందని?” గంభీరంగా అడిగినాడు. ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అహయామేఘచంద్రులు. “నేనే స్వామీ!” దృఢంగా అన్నది సీహా. “నీవు చూసినావా?” మరింత చురుగ్గా అడిగినాడు పురోహితుడు.
“చూసిన వాళ్లు చెప్పినారు..” ఆలోచిస్తూ సీహా. “వాళ్లు రోహా మృతదేహం చూసినారా?” మరింత కటువుగా అడిగినాడు శాస్త్రి. “అవును!” అంతరంగంలో ఆందోళన; మాటలలో తత్తర పాటుతో సీహా. “ఆమె రోహాదేవియే అని నిర్ధారించినారా?” మరింత గట్టిగా అడిగినాడు పరమేశ్వర శాస్త్రి. “ఆఁ… ఔను!” “అబద్ధం!” గంభీరంగా, దృఢంగా, అరిచినట్లుగా అన్నాడు పురోహితుడు శాస్త్రి. ముగ్గురూ ఉలిక్కి పడ్డారు! పరివార జనమంతా ఆ మాటతో అక్కడ గుమిగూడినారు. “ఇది పచ్చి అబద్ధం! రోహాదేవి బతికే ఉన్నది!” దైవవాణి పలికినట్లు అన్నాడు పురోహితుడు. అక్కడున్న అందరికీ ఆ మాటలతో ఒళ్లు గగుర్పొడిచింది. “ఆమె క్షేమంగా ఉన్నది! నిండు నూరేళ్లు బతుకుతుంది! పండంటి బిడ్డలను ఇద్దరిని కంటుంది! ఇది నిజం! ఇదే నిజం!” అన్నాడు చాలా స్పష్టంగా శాస్త్రి. ఆశ్చర్యం, ఆనందం తాండవించింది ఆ ఇంటిలో. “ఏం మాట్లాడుతున్నారు స్వామీ! ఇది నిజమా?” ముందుగా తేరుకున్న మేఘచంద్రుడు నమ్మలేనట్లుగా అన్నాడు. “ఇది నిజం కాకపోతే ఈ పరమేశ్వర శాస్త్రి బతుకు కూడా అబద్ధమే మేఘచంద్ర ప్రభూ!” అన్నాడు ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా పురోహితుడు.
“ప్రత్యక్ష సాక్షులు చెప్పినారు స్వామీ…” మాటలు కూడగట్టుకుంటున్నట్లు అన్నది సీహా. “నన్ను నమ్మండి తల్లీ! ఒక్కొక్కసారి కన్ను కూడా అబద్ధం చెబుతుంది. నిజంగా వాళ్లు రోహాదేవి శరీరాన్ని చూసినారా? బాగా ఆలోచించుకొని, గుర్తు తెచ్చుకొని చెప్పు…” నెమ్మదిగా మళ్లీ అడిగినాడు పురోహితుడు. ఆరోజు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది సీహా. కొంచెం సేపు ఆలోచించుకొని.. “కుటుంబమంతా కాలిపోయింది. శరీరాలు గుర్తుపట్టలేనంతగా మసి అయిపోయినాయని అన్నారు చూసినవాళ్లు” చెప్పింది సీహ. “అయితే ఈ సంఘటన మహాభారతంలో లక్క ఇల్లు కాలిపోవడం వంటిదే! ఆనాడు పాండవులు చనిపోలేదు; ఈనాడు మీ అక్కకి ఏమీ కాలేదు!” దృఢంగా, నమ్మకంగా అన్నాడు శాస్త్రి. “అవునా? ఇది నిజమా?” సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది సీహా. “మీ అక్క మాత్రమే కాదు! మీ అత్త కూడా ప్రాణాలతోనే ఉన్నది” అన్నాడు శాస్త్రి, తన జ్యోతిషశాస్త్రం మీద పూర్తి విశ్వాసంతో. అక్కడ అందరి మనసులు ఆనందతాండవం ఆడసాగినాయి. “అవును! మా బావగారు రోహా వివాహం అయిన కొత్తలో తన కోటను అంతా పరిచయం చేసినారు. అందులో ఒక రహస్య మార్గం ఉన్నది!” గుర్తుకు తెచ్చుకుంటూ ఏదో ఆధారం దొరికినట్లు అన్నాడు మేఘచంద్రుడు.
ఆ మాటలు పురోహితుని విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసినాయి. అందరి ముఖాలు వాడిన పూలు వికసించినట్లయినాయి. “అయితే వాళ్లు కచ్చితంగా ఆ రహస్య ద్వారం గుండా తప్పించుకొని ఉంటారు!” అన్నాడు పరమేశ్వర శాస్త్రి. “అదే నిజమైతే, మీకు కనకాభిషేకం చేస్తాం స్వామీ!” ఆనంద బాష్పాలు జలజలా రాలుతుండగా అన్నాడు మేఘచంద్రుడు. “అయ్యగారు అన్నారంటే అయ్యితీరుతుంది!” దృఢమైన విశ్వాసంతో అన్నది అహయాదేవి. “అప్పుడు రోహాను అత్తవారింటికి పంపిస్తుంటే… అది ఆమెకు, వాళ్ల అత్తగారి కుటుంబానికి మంచిది కాదని హెచ్చరించినారు. వారు హెచ్చరించినట్లే ఆ కుటుంబమంతా అతలాకుతలమైంది” గుర్తు చేసింది. “మరి నా కూతురు బతికి ఉంటే తన గురించి తెలుసుకోవడం ఎట్లా? ఆ రహస్య ద్వారం పరిస్థితి ఏమిటో, అది ఎక్కడ తెరుచుకుంటుందో… మనం అస్మకరాజ్యంలో స్వేచ్ఛగా అన్ని చేయగలమా?” ఆలోచిస్తూ అన్నాడు మేఘచంద్రుడు. “సాధ్యం కాదు! అడ్డంకులు ఏర్పడతాయి. మీకు మన రాజు విష్ణుముఖునితో మంచి పరిచయం ఉన్నది కదా! వారిని కలిసి ఈ పరిణామాలన్నీ చర్చించండి. మంచి దారి దొరుకుతుంది. మీ బిడ్డ కూడా దొరుకుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఆందోళన మరచి, ప్రశాంతంగా అడుగులు కదిలించండి!” అన్నాడు పురోహితుడు. ఆ ఇంటిలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. ఆ మధ్యాహ్నమే మహారాజును కలిసేందుకు బయలుదేరినాడు మేఘచంద్రుడు.
కూర్మాచలంలో… మాధవుడు తన శిష్యులందరితో సమావేశమైనాడు. అతని ముఖం ఎప్పటిలా ప్రశాంతంగా లేదు. ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి, ఎవరికోసమో ఎదురుచూస్తున్న ఆందోళన తరచూ అతని మనసును కదిలిస్తున్నాయి. “స్వామీ! సాధనానందుని కోసమేనా మీ నిరీక్షణ?” అతని అంతరంగాన్ని చదివినట్లే అన్నాడు నిర్మలానంద. నిర్మలానంద కూడా ఇంచుమించు సాధనానందుడు చేరిన కాలంలోనే మాధవుని శిష్య బృందంలో భాగమైనాడు. వాళ్లిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. నిర్మలానందుని మాటలతో మాధవుని మొఖం మీద ఒక చిరునవ్వు విరిసి మాయమైంది. “అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా?” అన్నాడు సాలోచనగా. “అంటే కచ్చితంగా తెలియదు స్వామీ! మునిపల్లె సమావేశం తర్వాత మేమిద్దరం కలిసే బయలుదేరినాము. జంగిటికి ముందు మా దారులు వేరైనాయి. నేను అమరావతి మీదుగా కృష్ణాతీర ప్రాంత గ్రామాలకు వెళ్లినాను. నిర్ధారిత సమయం పూర్తికాగానే ఇక్కడికి చేరుకున్నాను. తాను శ్రీరంగపురం మీదుగా ఇక్కడికి వస్తానన్నాడు. నిజానికి అతనే నాకన్నా రెండు రోజులు ముందుగా చేరుకోవాలి. ఇంకా రాకపోవడం ఆలోచించదగినదే!” అన్నాడు కొంచెం విచారంగా.
ఆలోచనలో పడిపోయినాడు మాధవుడు. “మనం నడిచే దారి ప్రశాంతత కోసమే కానీ, మనకు ప్రశాంతత అంత సులువుగా లభించదు. మనల్ని కొందరు ఆదరిస్తే ఇంకొందరు వ్యతిరేకిస్తారు; కొందరు అభిమానిస్తే మరికొందరు అసూయపడతారు; కొందరు ప్రేమిస్తే ఎక్కువ మంది ద్వేషిస్తారు; కొందరు తటస్థంగా ఉంటే మరికొందరు అకారణ ద్వేషం పెంచుకుంటారు. మనం మాత్రం రాగద్వేషాలకు అతీతులుగా ఉంటూ, బుద్ధుని బోధనలను శ్రద్ధగా ఈ జగత్తులో వ్యాపింపజేయాలి” అన్నాడు. “అయితే మన సాధనానందుడు ఏదో ప్రమాదంలో పడిపోయి ఉంటాడా స్వామీ!” మనసులోని ఆందోళనను అణచుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు నిర్మలానంద. “ఆ అవకాశం లేకపోలేదు…” అన్నాడు మాధవుడు. “అయితే నేను సాధనానందుని వెతకడానికి అనుమతినియ్యండి స్వామీ!”అన్నాడు నిర్మలానంద.