దుబ్బాక, మార్చి 16 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బా క మండలం రఘోత్తంపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నల్లా దేవిరెడ్డి (60) తనకున్న నాలుగు ఎకరాల్లో పంట సాగు చేసి, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా సరైన దిగుబడులు రావడం లేదు. పంట సాగు, కుటుంబ పోషణ కోసం తెలిసిన వారివద్ద రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో ఎకరం భూమి అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. మిగిలిన మూడెకరాలు తన సోదరులతో పొత్తులో ఉండటంతోపాటు సర్వే నంబర్లు వేర్వేరుగా ఉండటంతో విక్రయించే పరిస్థితి లేకుం డా పోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక తీవ్రంగా కుంగిపోయిన దేవిరెడ్డి.. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృ తుడు దేవిరెడ్డి భార్య అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.