న్యూఢిల్లీ, మార్చి 16 : దేశీయ ఎగుమతులు పడిపోయాయి. గత నెలలో 36.61 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఇది 0.81 శాతం తక్కువ. ఇక ఇదే సమయంలో దేశంలోకి దిగుమతులు 24.11 శాతం ఎగిసి 63.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెరిగిన బంగారం, వెండి దిగుమతులే కారణమని సోమవారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.
పసిడి దిగుమతులు ఏకంగా 218.55 శాతం వృద్ధితో 7.44 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో స్విట్జర్లాండ్ నుంచి వచ్చినవే 2.71 బిలియన్ డాలర్ల విలువైనవి. మునుపటితో చూస్తే 719.30 శాతం పెరిగాయి. వెండి దిగుమతులు కూడా 285.23 శాతం ఎగబాకి 1.66 బిలియన్ డాలర్లను తాకాయి. ఇక చమురు దిగుమతులు 9 శాతం పుంజుకొని 12.97 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా, వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 2025 ఫిబ్రవరిలో 14.05 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం.