నర్సాపూర్, డిసెంబర్ 19: బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దివంగత మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి 60వ జయంతిని పురస్కరించుకొని వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ఐదురోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం ఈ క్రీడలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. నేడు యువత బైక్‌లపై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోక ప్రాణాలు కోల్పోతున్నారని, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు
– ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ చొరవతో ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడామైదానాలను ఏర్పాటు చేసుకున్నామని, వాకిటి లక్ష్మారెడ్డి క్రీడాభిమాని అని అతడి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని ఐకమత్యంతో, క్రమశిక్షణతో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. గ్రామ స్థాయిలోని క్రీడాకారులను ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం
– సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్
క్రీడలతో మానసిక ఉల్లాసం, ప్రశాంతత లభిస్తుందని, శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. లక్ష్మారెడ్డికి క్రీడలు అంటే ఎంతో ఇష్టమన్నారు. మట్టిలో మాణిక్యాలైన గ్రామస్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో నర్సాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన ఈ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు. 8 మండలాల నుంచి 118 టీమ్‌లు వాలీబాల్ ఆడడానికి ముందుకు వచ్చాయని తెలిపారు.
టోర్నమెంట్ ముగింపు రోజు 23న ప్రజాప్రతినిధులు కూడా టోర్నమెంట్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, వివిధ మండలాల ఎంపీపీలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, నర్సింహులు, క్రీడాకారులు పాల్గొన్నారు.