జహీరాబాద్, అక్టోబర్ 1: వానకాలం వచ్చిందటే ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు రెండు రాష్ర్టాల వాహనచోదకులు, పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో భారీ వర్షాలు కురిస్తే వరద వచ్చి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాకపోకలు సాఫీగా సాగేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆల్గోల్ చౌరస్తా సమీపంలో కల్వర్టు, బీటీ రోడ్డు నిర్మాణానికి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రూ. 33 లక్షల నిధులు మంజూరు చేసింది.
గడువులోగా కల్వ ర్టు, బీటీ రోడ్డు పనులు పూర్తిచేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్ నిధులు రావడం లేదనే సాకుతో కల్వర్టు మాత్రమే నిర్మించి, బీటీ రోడ్డు పనులు చేపట్టకుండా వదిలేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. మూడేండ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులతో ఆయా రాష్ర్టాలకు చెందిన వాహనచోదకులు, జహీరాబాద్ మండలంలోని పోట్పల్లి, ఎల్గొయి, అల్గోల్ గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీవర్షాలు కురిస్తే కల్వర్టుపై నుంచి వరద పారుతున్నది. కల్వర్టుకు ఇరువైపులా బీటీ రోడ్టు పనులు చేపట్టకపోవడంతో గుంతలు పడిన రోడ్టుపై రాకపోకలు సాగించే వాహనచోదకులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
జహీరాబాద్ పట్టణ సమీపంలోని అల్గోల్ చౌరస్తా సమీపంలో బైపాస్ రోడ్డు గుండా భరత్ నగర్, అల్లానా ఫ్యాక్టరీ మీదుగా బీదర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో కొన్నేండ్ల క్రితం వాగుపై నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కల్వర్టుకు ఇరువైపు సైడ్ బర్మ్ లేకపోవడంతో వాహనచోదకులు జాగ్రతగా వెళ్తుంటారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వరద కల్వర్టు వాగు గుండా వెళ్తది. వాహనోచోదకులు, ప్రజల ఇబ్బందులు దూరం చేసేందుకు కల్వర్టు, బీటీ రోడ్డుకు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, శిథిలావస్థకు చేరిన కల్వర్టు దగ్గర నిర్మించాల్సి ఉండగా.. చుక్క నీరు ప్రవహించని మరోచోట కల్వర్టును నిర్మించారు.
వరద వెళ్లేలా కాలువలు, వాగులపై కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మించడం సర్వసాధారణం. కానీ, కల్వర్టు అవసరం ఉన్నచోట కాకుండా చుక్కనీరు ప్రవహించని చోట నిర్మించడం ప్రజాప్రతినిధులకు ప్రయోజనం చేకూర్చమా.. లేక అధికారుల తప్పిదామా.. కాంట్రాక్టర్కు లాభం చేకూర్చేందుకు చేపట్టారో అంతుపట్టడం లేదు. వర్షాలకు శిథిలావస్థకు చేరిన కల్వర్టు గుండా వరద వెళ్తున్నది. మరోచోట నిర్మించిన కల్వర్టు నుంచి చుక్క వరద పారడం లేదు. దీనిని చూపి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇక్కడ ఎందుకు కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదించారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్అండ్బీ అధికారుల అవినీతి, కాంట్రాక్టర్ అక్రమాలకు ఈ కల్వర్టు నిదర్శనంగా నిలుస్తున్నదని అటుగా రాకపోకలు సాగించే వాహనచోదకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడేండ్లుగా పురోగతి కరువైన కల్వర్టు, బీటీ రోడ్డు పనులతో ప్రజలు, వాహనచోదకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కల్వర్టు పరిసరాల్లో గుంతలు పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల నాలుగైదు రోజులు వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. అయినా అధికారులకు చీమ కుట్టినట్టు అనిపించడం లేదు.