వానకాలం సాగు పత్తి రైతుకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. 33శాతానికి పైగా పంటనష్టం జరిగితేనే పరిహారానికి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం రైతులకు ఆశనిపాతంలా మారింది. సంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి పంట నీట మునిగితే వ్యవసాయ అధికారులు మాత్రం 20,570 ఎకరాల్లో మాత్రమే పత్తి పంటకు నష్టం జరిగినట్లు తేల్చారు. దీంతో వందలాది మంది రైతుల పేర్లు పంటనష్టం జాబితాలో చేరలేదు. దీనికి తోడు అధిక వర్షాలకు పత్తి పంటదిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 12 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి అందే పరిస్థితి లేదు. ఇక చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనలు రైతులకు మరింత నష్టం చేకూరుస్తున్నాయి.
సంగారెడ్డి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో రైతులు అత్యధికంగా పత్తి పంట సాగుచేశారు. 2025-26 సీజన్లో 3.78 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అధిక వర్షాలకు జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. ప్రభుత్వం 33 శాతం నష్టం నిబంధనతో జిల్లాలో కేవలం 20,570 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆగస్టులో కురిసన వర్షాలకు 2850 మంది పత్తి రైతులు 3362.25 ఎకరాల్లో పత్తి నష్టం చవిచూశారు. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు 9939 మంది రైతులకు చెందిన 10,052 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. మొంథా తుపాన్ ప్రభావంతో అక్టోబర్‌లో 8166 మంది రైతులకు చెందిన 7156 ఎకరాల్లో పత్తిపంట దెబ్బతిన్నది. అధికారికంగా 20,570 ఎకరాల్లో పంటనష్టం జరిగినప్పటికీ, అంతకుమించి 60వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా. పంటనష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంతవరకు జిల్లా రైతులకు పరిహారం అందలేదు. అధిక వర్షాలతో పంటనష్టంతో పాటు పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది.
అశనిపాతంలా సీసీఐ నిబంధనలు
పత్తి రైతులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతంలో మాదిరిగా పత్తి రైతు పంటను నేరుగా సీసీఐ కేంద్రాలకు తరలించి అమ్మే పరిస్థితి ఈ దఫా లేదు. పత్తి అమ్మాలంటే రైతు తప్పనిసరిగా తన పేరు వ్యవసాయశాఖలో నమోదు చేసుకోవడంతో పాటు మందుస్తుగానే స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ప్రతి రైతు కపాస్ కిసాన్ యాప్‌లో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
చాలామంది రైతులకు దీనిగురించి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నెట్వర్క్,ఆన్లైన్ సమస్యలతో పత్తి రైతులు సతమతం అవుతున్నారు. సీసీఐ తేమ నిబంధన రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. 8 నుంచి 12 శాతంలోపు తేమ ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ చెబుతున్నది. 12 శాతానికి పైగా తేమ ఉంటే పత్తి కొనుగోలు చేయమని సీసీఐ స్పష్టమైన ప్రకటన చేసింది. 8శాతం తేమ ఉన్న పత్తికి రూ.8110 మద్దతు ధర ఇస్తామని, 8 శాతానికి పైగా తేమ శాతం పెరిగితే మద్దతు ధర తగ్గించి చెల్లిస్తామని సీసీఐ చెబుతున్నది. 9శాతం తేమ ఉంటే రూ.8028, 10శాతం తేమ ఉంటే రూ.7947, 11శాతం తేమ ఉంటే 7866, 12శాతం తేమ ఉంటే రూ.7785 మద్దతు ధర చెల్లిస్తామని సీసీఐ ప్రకటించింది.
అధిక వర్షాల కారణంగా తేమ శాతం 12 నుంచి 15 శాతం వరకు ఉంది. తేమశాతం 15కు పైగా ఉన్నప్పటికీ సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 8 క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడి వచ్చింది. అధిక దిగుబడి వచ్చిన రైతులు ఎక్కడ పత్తి అమ్ముకోవాలని సీసీఐ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర రూ.12వేలకు పెంచాలని కోరుతున్నారు. సీసీఐ తీరును నిరసిస్తూ జిల్లాలోని పత్తి రైతులు ఆందోళనలు చేస్తున్నా సీసీఐ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఎల్-1 నిబంధనతో రైతులకు ఇక్కట్లు
సంగారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేయడం ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లులు ఉండగా, 22 జిన్నింగ్ మిల్స్‌లో పత్తి కొనుగోలుకు సీసీఐ నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటి వరకు 17 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము చెప్పిన చోటే రైతులు పత్తి అమ్మాలంటూ సీసీఐ తీసుకువచ్చిన నిబంధనపైనా పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని 22 నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులను సామర్థ్యం, మౌలిక సదుపాయాలు పరిగణలోకి తీసుకుని ఎల్ 1, ఎల్ 2, ఎల్3 కేటగిరీలుగా సీసీఐ విభజించింది. జిల్లాలో 7 జిన్నింగ్ మిల్లులు ఎల్-1, ఎల్- 2లో మరో 7 జిన్నింగ్ మిల్లులు, 8 జిన్నింగ్ మిల్లులు ఎల్-3 కేటగిరీలో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్-1 కేటగిరీలోని జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎల్-2 ప్రాంతంలోని రైతులు, ఎల్-3 ప్రాంతంలోని రైతులకు ప్రస్తుతం ఎల్-1 జిన్నింగ్ మిల్లులు కేటాయించారు. సదాశివపేట మండలంలోని ఎల్-1 జిన్నింగ్ మిల్లు వద్దకు రాయికోడ్ ప్రాంత రైతులు తమ పత్తిని తరలించాల్సి ఉంటుంది. దీంతో రైతులపై ట్రాన్స్‌పోర్టు భారం పడుతున్నది. ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీని ఎత్తివేసి సమీపంలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.