పటాన్చెరు, జులై 31: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన కుర్ర సత్యనారాయణను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశ విశేషాలను మంత్రి కేటీఆర్ విలేకరులకు వివరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శాసనమండలికి ఇద్దరు సభ్యులను ఎంపిక చేసినట్టు తెలిపారు. డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను శాసనమండలి అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. కుర్ర సత్యనారాయణ సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1999 నుంచి 2004 వరకు సేవలందించారు.
జనతా పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. అనంతరం 2017లో బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్కి ఆయన చేసిన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. కార్మిక సంఘం నాయకుడిగానూ ఆయనకు సుధీర్ఘ అనుభవం ఉంది. సౌమ్యుడు, స్నేహశీలి, అందరిని కలుపుకొని వెళ్లే స్వభావం ఉండటంతో పటాన్చెరు ప్రాంతంలో ఆయనకు మంచిపేరు ఉంది.