కొల్చారం, సెప్టెంబర్ 29: మండలంలోని పోతాన్‌శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ఆమె మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు పోతాన్‌శెట్టిపల్లి చౌరాస్తా రోడ్డు దుస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె పోతాన్‌శెట్టిపల్లి చౌరస్తా వద్దకు చేరుకుని రోడ్డును పరిశీలించారు. రోడ్డు అధ్వానంగా మారడాన్ని చూసి అక్కడ నుంచి ఆర్అండ్బీ డివిజన్ ఎస్సీకి ఫోన్ చేసి, వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతాన్‌శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై నిండా నీరు నిలిచి, చెరువును తలపిస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుకు సైతం ప్రమాదం జరిగి పట్టీలు విరిగిపోయాయన్నారు. తాను మండలంలో పర్యటించిన ప్రతిసారి ఈ రోడ్డు విషయాన్ని ప్రస్తావిస్తున్నానని, సమస్య పరిష్కారం కాలేదన్నారు. మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ మెదక్‌ను సందర్శించినప్పుడు తాను మెదక్, జోగిపేట్ రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరానన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని, డ్రైనేజీ నిర్మాణం చేసి సమస్య పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే ఆర్అండ్బీ శాఖ మంత్రికి మెమోరాండం ఇచ్చి మెదక్, జోగిపేట్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరతానన్నారు.
మండలంలో కల్యాణలక్ష్మి చెక్కులు విడుదలై ఏడాది గడుస్తున్నా పంపిణీకి నోచుకోలేదన్నారు. కొన్ని మండలాల్లో చెక్కుల కాల పరిమితి ముగియడంతో రెన్యువల్ చేసిన దాఖలాలున్నాయన్నారు. ఈ నియోజవర్గంలో తాము చెక్కులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కొల్చారంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెక్కులు విడుదలయ్యాయని వాట్సాప్ స్టేటస్లు పెట్టడంతో ప్రజలు అడుగుతున్నారన్నారు. మంత్రి వచ్చి చెక్కులు ఇస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు.
బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాడెపు నారాయణ కుమారుడు నిఖిల్ ఇటీవల మృతిచెందాడు. ఆయన దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన ఎం.అనిల్‌తో పాటు మరో కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. విద్యార్థిని ఈ.నందిని గతేడాది పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించింది.
ఆమెను అభినందించి, ప్రోత్సాహక నగదు అందజేశారు. తుక్కాపూర్‌లో పర్యటించి మృతిచెందిన బొడ్ల అనంతప్ప, దొడ్ల శ్రీశైలం, దొడ్ల భుజంగం, ఎనగండ్లలో మాజీ ఎంపిటీసీ కవితా శ్రీనివాస్ కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, అరిగె రమేశ్, నాయకులు ముత్యంగారి సంతోష్‌కుమార్, మాజీ సర్పంచులు కొమ్ముల యాదాగౌడ్, చిట్యాల యాదయ్య, నెల్లి కిష్టయ్య, సిద్దిరాములు, మల్లేశం, సోమ నర్సింహులు, బాగారెడ్డి, విఠల్‌రెడ్డి, రవీందర్, దుర్గేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
నర్సాపూర్, సెప్టెంబర్ 29: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మున్సిపాలిటీకి చెందిన నాయికోటి వాల్మీకి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.25 వేలు మంజూరయ్యాయి. బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఆఫ్రిన్ ఫాతిమాకు మంజూరైన రూ.57 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, సూరారం నర్సింహులు, షేక్ హుస్సేన్, రింగుల ప్రసాద్, సుధాకర్‌రెడ్డి, వినయ్, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి, సెప్టెంబర్ 29 : కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సుగ్గి ముర్షద్ తండ్రి ఇటీవల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారిని పరామర్శించారు. ఆమె వెంట మాజీ సర్పంచ్ కాంతారావు, మాజీ ఉపసర్పంచ్ రాములు, గ్రామకమిటి అధ్యక్షులు జజ్జరి వెంకన్న, నాయకుడు రాజు, ప్రవీణ్‌కుమార్, పద్మారావు తదితరులు ఉన్నారు.