సంగారెడ్డి, మే 11(నమస్తే తెలంగాణ): పార్లమెం ట్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన అనంతరం ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలను కలియతిరిగారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగించారు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గా లు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నా యి.
సంగారెడ్డి, పటాన్చెరు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉండగా, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దీంతో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం వరకు జోరుగా ప్రచా రం చేశారు. ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ తదితర దిగ్గజ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ జహీరాబాద్ పార్లమెంట్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. సీఎం రేవంత్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభలో, పటాన్చెరులో రోడ్‌షోలో పాల్గొన్నారు.
ప్రచారంలో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. ఇతర పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్కుమార్లను అభ్యర్థులుగా ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మాజీమంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్‌షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొదట అందోలు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ సమీపంలో లక్ష మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరిగింది.
ఏ పార్టీ నిర్వహించని విధంగా కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కావటంతో పాటు ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర జరిగింది. ఈనెల 8 పటాన్చెరులో కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్‌షో నిర్వహించారు. 50వేల మందితో నిర్వహించిన రోడ్‌షో సక్సెస్ అయింది. కేసీఆర్ ప్రచారంతో బీఆర్ఎస్కు సంగారెడ్డి జిల్లాలో బలం పెరిగింది.
ఇదిలాఉంటే బీఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, పాలన విఫలం కావడంతో ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గ చూపుతున్నారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈనెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు రెండురోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను అధినేత కేసీఆర్ ఓటర్లకు వివరించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గ చూపుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు ఇలా అన్ని వర్గాలు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారం ముగియడంతో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. సోమవారం ఎన్నికల జరుగనుండడంతో ఆదివారం పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను, పోలింగ్ సిబ్బంది తరలించేలా ఏర్పాటు చేపట్టింది. ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నారు.