కొల్చారం, డిసెంబర్1: కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో సోమవారం బీఆర్ఎస్మండలశాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్‌లో బలమైన నాయకులు లేక బీఆర్ఎస్ నాయకులను ప్రలోభాలకు గురిచేసి పార్టీమారేలా ప్రోత్సహిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీ లు, ఆరు గ్యారెంటీలను ఎండగట్టాలన్నారు. భార్యకు ఉచిత బస్సు పెట్టి భర్తకు డబల్ కిరాయి పెంచారని ఎద్దేవా చేశారు. రైతు బంధు ఎగ్గొట్టారన్నారు. యాసంగి సీజన్‌కి సంబంధించి తొమ్మిది కోట్లకుపైగా బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసీఆర్ కోటి 30 లక్షల చీరలు పంపిణీ చేస్తే కాంగ్రెస్ కేవలం 50 లక్షల చీరలు పంచిందన్నారు. అదికూడా ఒకే రంగు చీరలు కేవలం మహిళాసంఘాల సభ్యులకే పరిమితం చేశారన్నారు. ప్రతిమహిళకు రూ.2500, యువతులకు స్కూటీలు ఇవ్వలేదని, పింఛన్ నాలుగువేలకు పెంచలేదన్నారు.
తులం బంగారం ఇస్తలేరన్నారు. సకాలంలో రైతు బీమా అందడం లేదన్నారు. కేసీఆర్ అన్ని భూములకు రైతుబంధు ఇస్తే కాంగ్రెస్ సాగుచేసే భూములకే ఇస్తామంటూ కోత విధించే కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారన్నారు. ఇండ్లు రాని వారు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే కోటా కింద 1400 ఇండ్లు ఉన్నాయని, దరఖాస్తు చేసుకుని ఇండ్లు రానివారికి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకవెళ్లి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పైతర గ్రామానికి చెందన పలువురు కాంగ్రెస్ నాయకులు యాబన్నగారి రవితేజరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, యువత అధ్యక్షుడు సంతోష్, మాజీ ఎంపీపీ మంజులాకాశీనాథ్, మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్, సీనియర్ నాయకులు భాగారెడ్డి, వేమారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ముత్యం ప్రవీణ్, మోత్కు మల్లేశం, రవితేజరెడ్డి, గోదావరి, ఆంజనేయులు, రవీందర్ పాల్గొన్నారు.