నర్సాపూర్, ఫిబ్రవరి21: ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి రానున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్ పట్టణంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఐదోరోజుకు చేరుకుంది. రిలే నిరాహారదీక్షలో భాగంగా నర్సాపూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నుంచి చెత్త తరలించడానికి సుమారు 200 నుంచి 250 టిప్పర్లు రోడ్లపై తిరుగుతాయని, దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే వర్షం పడ్డప్పుడు ప్రతి నీటి బొట్టు రాయారావు చెరువులోకి వస్తుందని, దీంతో చెరువు కాలుష్యమవుతుందన్నారు. డంపింగ్ యార్డు వల్ల దుర్గంధంతోపాటు గాలి, నీరు కలుషితమవుతాయన్నారు.
జవహర్‌నగర్ ప్రాంతవాసులు కోర్టును ఆశ్రయించగా జీహెచ్ఎంసీ పరిధిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసి చెత్తను తరలించాలని గతంలో కోర్టు తెలిపిందని, దీనికి విరుద్ధంగా ప్యారానగర్లో ప్రభుత్వం డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తుందని మండిపడ్డారు. గుమ్మడిదల మండలానికి చెందిన ప్రజలు డంపింగ్‌యార్డు వద్దని తీర్మానం చేసినప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దుర్మార్గంగా వందలమంది ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి టిప్పర్లతో మట్టిని తీసుకువచ్చి పనులు ప్రారంభించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని మానుకోవాలని లేదంటే ఈ పోరాటాన్ని ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జేఏసీ నాయకులు రాజేందర్, షేక్ హుస్సేన్, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.