నర్సాపూర్, జనవరి : ఎన్టీవీ రిపోర్టర్లను మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో బయటికి వెళ్తున్న ఓ రిపోర్టర్ని అలాగే తన పనిని ముగించుకొని వెళ్తున్న మరో రిపోర్టర్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు కనపడుతుందని మండిపడ్డారు. మీడియాలో ఏదైనా కథనాలు వస్తే దానిపైన పూర్తి విచారణ జరిపి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్టులు చేయాలి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇది కేవలం పత్రిక స్వేచ్ఛను అరించడమే అలాగే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని మండిపడ్డారు. ప్రభుత్వానికి కథనం అనుకూలంగా వస్తే దాన్ని సానుకూలంగా తీసుకుంటారని, వ్యతిరేఖంగా వస్తే దాన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మంచి పద్దతి కాదని అన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ పూట మూడు రోజుల సెలవులు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈ అరెస్టులు చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం పద్దతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.