నర్సాపూర్, ఆగస్టు 6 : కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు గత 26 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఆమె సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలను అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులకు భూమికి భూమి లేదా మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమోద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, జడ్పీటీసీ బాబ్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు జీవన్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, రింగుల ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.