దుబ్బాక/మిరుదొడి, నవంబర్ 30: అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో నూతన తహసీల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు భంగపాటు తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో బుధవారం నూతన తహసీల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పార్టీ శ్రేణులతో కలిసి నడుకుంటూ వచ్చారు.
తహసీల్ కార్యాలయాన్ని ప్రారంభం చేయగానే బీజేపీ నాయకులు కేకలు పెడుతూ నూతన తహసీల్ కార్యాలయ ఆవరణలో ఉన్న వివిధ రకాల పూల కుండీలను చిందర వందర చేసి గొడవను సృష్టించడానికి ప్రయత్నం చేశారు. మంత్రి, ఎంపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి వెళ్లారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం నూతన తహసీల్ కార్యాలయంలోనే ఉండిపోయారు. రోడ్డుపైకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహానికి లోనై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇక్కడ ఏ అభివృద్ధి పని జరిగినా గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తహసీల్ కార్యాలయం నుంచి వెళ్లినా బీజేపీ నాయకులు ఎందుకు వెళ్లడం లేదంటూ మండిపడుతూ రోడ్డుపై బైఠాయించడానికి ప్రయత్నించారు.
పోలీసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులను రోడ్డుపై కూర్చోకుండా అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు పోలీసులు చుట్టూ ప్రహారా కాస్తూ పంపించారు. ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు వెళ్లడంతో గొడవ సద్దుమనిగింది.