చేర్యాల, జనవరి 22 : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గొప్ప భక్తితత్పరుడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో భాగంగా మండలంలోని దొమ్మాట రామాలయంలో సోమవారం ఆయన ప్రత్యేక పూజలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధి, భక్తుల వసతులపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దీంతో ఆలయాల ఆదాయం పెరిగిందన్నారు. దేశంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మించారని గుర్తుచేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలకు నిధులు కేటాయించి, ధూపదీప నైవేద్యాల కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన చల్లా లక్ష్మి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించడంతో పాటు ఆర్థికసహాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గాలిపల్లి సుభాషిణిరెడ్డి, ఎంపీటీసీ ముచ్చెంతల వినోదాచుక్కారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షుడు ఒంటెల్పుల చంద్రం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఉల్లెంగల ఏకానందం, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, పాల బాలరాజు, నండిమింటి శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు పాల్గొన్నారు.