చేర్యాల, డిసెంబర్ 6: కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రజల విశ్వాసం కోల్పోయిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చేర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన అవకాశంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ అడుగు జాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హైదరాబాద్‌లో సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పూలమాలలు వేసి నివాళులర్పించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, పోలీసులు చట్టాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు, నిర్బంధాలను ఛేదించి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు చింతల పరశురాములు, కొత్త దొమ్మాట బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొలిపాక భాస్కర్ ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ ఆఫ్టికల్స్ విజన్ ఐ కేర్‌ను సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, కౌన్సిలర్ మంగోలు చంటి, ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, మంద యాదగిరి, తలారి కిషన్, సుంకరి మల్లేశం, పెడుతల ఎల్లారెడ్డి, శివగారి అంజయ్య, జింకల పర్వతాలు యాదవ్, గదరాజు చందు, వకులాభరణం నర్సయ్య పంతులు, బూరగోని తిరుపతి గౌడ్, పచ్చిమడ్ల సిద్దిరాములు, కోతి దాసు, యాట భిక్షపతి, భూమిగారి రాజేందర్, అవుశర్ల కిశోర్, కొంగరి గిరిధర్, అకుల రాజేశ్‌గౌడ్, పచ్చిమడ్ల మానస, తాడెం రంజితా కృష్ణమూర్తి, మీస పార్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణానికి చెందిన వ్యాపారి దిడిగం నర్సింహులు కుమారుడి విహావానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరై ఆశీర్వదించారు.