చేర్యాల, జనవరి 10: తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మం చి చేసింది తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుక గార్డెన్స్‌లో శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాను న్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో గులాబీజెండా రెపరెపరాడాలని పిలుపునిచ్చారు. 13 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే సరిపోతుందని, ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మంచి పనులతో పాటు ఆయన అమలు చేసిన పథకాలను వివరించాలన్నారు.
కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రైతుబంధు, ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తెస్తున్న ‘భూమాత’తో రైతులకు కష్టాలు తెచ్చిపెట్టనుందని, దీనిపై ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ నాయకులు ప్రచారం చేయాలన్నారు. 24గంటల ఉచిత కరెంటుతో వ్యవసాయం పండగలా మారిందని, భూములకు ఎంతో విలువ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో భూములు ధరలు ఢమాల్ అన్నట్లు ఎమ్మెల్యే పల్లా తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, హామీలపై క్యాడర్ ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.
తన దవాఖానలో ప్రజలకు ఉచి త వైద్యం, పరీక్షలు, మందులిచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండ డం లేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, మీరే వారికి సమాధానం చెప్పాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సమావేశాల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రజాప్రతినిధులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, గీస భిక్షపతి, కౌన్సిలర్ మంగోలు చంటి, వుల్లంపల్లి కరుణాకర్, సిలువేరు సిద్దప్ప, తలారీ కీర్తనాకిషన్, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, సుంకరి మల్లేశం గౌడ్, పుర్మ వెంకట్‌రెడ్డి, వకులాభరణం నర్సయ్యపంతులు, ముస్త్యాల బాల్‌నర్సయ్య, ఏకానందం, కొండయ్య, యాదగిరి, గదరాజు చందు, బూరగోని తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.