చేర్యాల, ఆగస్టు 5: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణీశ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పట్టణంలోని కుడి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో ఉన్న చెట్లను తొలిగించాలని చైర్పర్సన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే ఐబీ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి చెరువులో ఉన్న చెట్లను తొలిగించేందుకు మున్సిపాలిటీకి సహకరించాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుడి చెరువు పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, చెరువు కబ్జాలో ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమగ్రంగా కొలతలు వేయించి చెరువు పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. చెట్లను తొలిగించడంతోపాటు వరదనీరు వచ్చే మార్గం, కట్ట పరిస్థితి తదితర అంశాలను స్థానిక రైతులతోపాటు బీఆర్ఎస్ నాయకులతో చర్చించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెరువుల సంరక్షణ కోసం మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టడడంతో ఎండిపోయిన చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. చెరువులకు గోదావరి జలాలు రావడంతో భూగర్భ జలాలు పెరిగి పంటలు పుష్కలంగా పండినట్లు తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు హయాం లో గోదావరి జలాలను ఎత్తిపోసి, చెరువులకు మళ్లిస్తే ఎంతో బాగుండేదని, గోదావరి నీళ్లు మొత్తం సము ద్రం పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యా ల బాల్నర్సయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మ ల్లేశం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, టౌన్ సెక్రటరీ బూరగోని తిరుపతి గౌడ్, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, టౌన్ అధ్యక్షుడు యా ట భిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొం డయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జిం కల పర్వతాలుయాదవ్, గదరాజు చందు, నాయకులు కూరపాటి మధు తదితరులు పాల్గొన్నారు.