చేర్యాల, సెప్టెంబర్ 5 : కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉన్నారన్నారు.
జనగామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో నియోజవర్గానికి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.200 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించి నిధులు మంజూరు చేస్తే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు పంపింగ్ చేసేందుకు దేవాదుల వద్ద నాలుగు మోటర్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
తపాస్‌పల్లి నింపితే అక్కడ నుంచి చెరువులకు నీటిని విడుదల చేయవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ ప్రజలకు నీలిమా దవాఖానలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వీరన్నపేట మాజీ ఎంపీటీసీ బొం దుగుల శివశంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అరిగె కనకయ్య, సోషల్ మీడి యా అధ్యక్షుడు బంగారిగల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.