చేర్యాల, జనవరి 4 : కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుకా గార్డెన్స్‌లో శనివారం చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారు పిలిస్తే కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చా రు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించేందుకు జనగామ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశానని, దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో బాధితులకు చెక్కులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మూడు అంచల విధానాన్ని తాను అనుసరిస్తున్నానని, మొదటగా సంబంధిత సర్కారు దవాఖానల్లో వైద్యం అందించడం, అక్కడ వారికి నయం కాని పక్షంలో పెద్ద దవాఖానలకు పంపించి అక్కడ వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అలాగే తనకు చెందిన నీలిమా దవాఖానలో నియోజకవర్గ ప్రజలు ఆధార్‌కార్డు తీసుకుని వస్తే ఉచితం వైద్య పరీక్షలు, వైద్యం, మందులు చేయిస్తున్నట్లు తెలిపారు.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని అన్ని చెరువులను నింపేందుకు ఇటీవల అధికారులతో తాను మాట్లాడినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం రూ.170 కోట్లను మంజూరు చేసి, కొంత భూమిని సేకరిస్తే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చెరువులకు కాల్వల నిర్మాణం పూర్తి అవుతుందని, దీంతో జనగామ, చేర్యాల ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో సీఎం, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తాను తీసుకుపోయినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన చేర్యాల ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయని, త్వరలో నూతన భవనాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీష్,మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశం,సీనియర్ నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య,బీఆర్ఎస్ టౌన్, మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం,సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి,యూత్ ఇన్చార్జీ శివగారి అంజయ్య, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల మానస, మీస పార్వతి, అరిగె కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.