చేర్యాల, డిసెంబర్ 16: పెండింగ్‌లో ఉన్న సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సోమవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో స్పీకర్‌తో పాటు సంబంధిత శాఖ మంత్రి సీతక్క దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. పంచాయతీ రాజ్ శాఖను బలోపేతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని సీఎం, మంత్రులు చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023లో అనేకమంది సర్పంచ్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి మొత్తం సమస్యలు పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కానీ సర్పంచ్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జనగామ నియోజకవర్గంలోని 8 మండలాల్లోని 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్‌కు దాదాపుగా రూ.45 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 12 నెలలు దాటినా ఒక్క రూపాయి రాలేదు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరాంచర్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు బిడ్డల పెండ్లిండ్లు పెట్టుకున్నారు. వారికి రావాల్సిన రూ.25లక్షల బిల్లులు రాకపోవడంతో బంగారం కుదవపెట్టి పెండ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాగిరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ భవాని ఇల్లు కుదవ పెట్టుకుంది. నియోజకవర్గంలో సగం మంది మహిళా ప్రజాప్రతినిధులు పేదలే.
బిల్లుల కోసం సచివాలయానికి వెళ్దామని అనుకోగానే తెల్లవారుజామున 4గంటలకు మహిళా సర్పంచ్‌లు అని చూడకుండా పోలీసులు అరెస్టు చేశారు. కనీసం మహిళా పోలీసులు లేకుండా మహిళా ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. రజాకారుల సమయంలో కూడా ఇంత నిర్బంధం జరగలేదు. సర్పంచ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టి బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.