జహీరాబాద్, జూన్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావ్ (MLA Manik Rao)అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారన్నారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో వారిపై హస్తం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమైందని విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
జహీరాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు యాకూబ్ ఆధ్వర్యంలో షేక్ ఇస్మాయిల్ మిత్రబృందం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్, ఇబ్రహీం, మొహమ్మద్ అలి, ఆల్లిపూర్ నాయకులు శంకర్ పటేల్, దీపక్, మోహన్, ప్రవీణ్ మెస్సీ తదితరులు పాల్గొన్నారు.