జిన్నారం(అమీన్పూర్), మే 20: సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో యూజీడీ, సీసీ రోడ్లు, చెరువుల అభివృద్ధి, కబ్జాల నివారణ తదితర సమస్యలను ఎమ్మెల్యే అధికారులు దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు అధికారులతో కలిసి పర్యటించినట్లు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతామన్నారు. కాలనీల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు త్వరలోనే శంకుస్థాపనలు చేస్తామన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్, నాయకులు బాలరాజు, కృష్ణ, ఆయా శాఖల అధికారులు, ఆయా కాలనీల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.