Hair Dye | కీమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్స తర్వాత జుట్టు తిరిగి పెరగడం క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న వారికి ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. జుట్టు మళ్లీ పెరగడం ద్వారా గతంలో కోల్పోయిన సహజ రూపం తిరిగి వస్తోందనే భావన కలుగుతుంది. అయితే కొత్తగా పెరుగుతున్న జుట్టు, దాని కింద ఉన్న చర్మం పూర్తిగా కోలుకునే వరకు హెయిర్ డై వంటి రసాయన ఉత్పత్తులను ఉపయోగించడంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స సమయంలో లేదా చికిత్స పూర్తయిన వెంటనే హెయిర్ డై వాడే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు శరీరంలో వేగంగా విభజించే కణాలను లక్ష్యంగా చేసుకుంటాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ఇవి కీలకంగా పనిచేసినప్పటికీ, ఆరోగ్యకరమైన హెయిర్ ఫోలికల్స్‌పై కూడా ప్రభావం చూపుతాయి. దీంతో జుట్టు పలుచబడటం లేదా పూర్తిగా రాలిపోవడం జరుగుతుంది. చికిత్స తర్వాత జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమైనప్పుడు కొత్తగా వచ్చే వెంట్రుకలు, తల చర్మం సాధారణ స్థితితో పోలిస్తే బలహీనంగా, పొడిగా, సున్నితంగా ఉండే అవకాశం ఉంటుంది.
కీమోథెరపీ సమయంలో, అలాగే చికిత్స పూర్తయిన తర్వాత కొన్ని నెలల పాటు తల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో చర్మంలోని సహజ తేమను కాపాడే పొర కూడా బలహీనపడుతుంది. అందువల్ల సాధారణంగా ఉపయోగించే పర్మనెంట్ హెయిర్ డైల్లో ఉండే కొన్ని ఆల్కలైన్ రసాయనాలు తల చర్మంపై మంట, తీవ్రమైన అలర్జీ, కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెరుగుతున్న జుట్టు ఫోలికల్స్‌కు కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. హెయిర్ డై వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదంపై కూడా పలు అధ్యయనాలు జరిగాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన సిస్టర్ స్టడీలో 35 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న 46 వేల మందికి పైగా మహిళల సమాచారాన్ని పరిశీలించారు. పర్మనెంట్ హెయిర్ డై, కెమికల్ హెయిర్ స్ట్రెయిటెనర్లను క్రమం తప్పకుండా ఉపయోగించే మహిళల్లో, వాటిని ఉపయోగించని వారితో పోలిస్తే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం గణాంకపరంగా కొంత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ముఖ్యంగా పర్మనెంట్ డైలను తరచూ ఉపయోగించేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా కనిపించింది.
హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన మరో దీర్ఘకాలిక అధ్యయనంలో 1.17 లక్షల మందికి పైగా మహిళలను 36 ఏళ్ల పాటు పరిశీలించారు. పర్సనల్ హెయిర్ డై వాడకానికి చాలా రకాల క్యాన్సర్లు లేదా మొత్తం క్యాన్సర్ మరణాల మధ్య స్పష్టమైన సంబంధం కనిపించలేదని ఈ అధ్యయనం పేర్కొంది. అయితే దీర్ఘకాలంగా పర్మనెంట్ హెయిర్ డై వాడేవారిలో కొన్ని రకాల బేసల్ సెల్ కార్సినోమాలు, అండాశయ క్యాన్సర్, కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ల ప్రమాదంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వ్యక్తిగతంగా హెయిర్ డై వాడటం, వృత్తిపరంగా హెయిర్ డై రసాయనాలకు గురికావడం మధ్య తేడాను పరిశీలించింది. వ్యక్తిగత హెయిర్ డై వినియోగాన్ని ప్రస్తుతం మనుషుల్లో క్యాన్సర్ కారకమా కాదా అని నిర్ధారించలేని గ్రూప్ 3లో ఉంచగా, హెయిర్డ్రెస్సర్లు, బార్బర్లు వంటి వృత్తిపరంగా రసాయనాలకు గురయ్యే వారికి సంబంధించిన ఎక్స్పోజర్ను బహుశా క్యాన్సర్ కారకమైనదిగా గ్రూప్ 2ఎలో వర్గీకరించింది. క్యాన్సర్ చికిత్స తర్వాత హెయిర్ డై ఉపయోగించాలని అనుకునేవారు ఉత్పత్తిలోని పదార్థాల జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా పారా-ఫెనిలీన్ డయామైన్ (పీపీడీ), అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పీపీడీ సాధారణంగా ముదురు రంగు పర్మనెంట్ డైల్లో కనిపిస్తుంది. ఇది కొందరిలో తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్లకు కారణం అవుతుంది.
అమ్మోనియాను జుట్టు క్యూటికల్‌ను విప్పి డై లోపలికి వెళ్లేలా చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది తల చర్మాన్ని మరింత పొడిగా చేయడంతోపాటు శ్వాసకోశంలో కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్, పర్మనెంట్ హెయిర్ కలరింగ్‌లో ఉపయోగిస్తారు. ఇది కొత్తగా పెరిగిన జుట్టులోని తేమ, నిర్మాణాత్మక ప్రొటీన్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డైల్లో ఉండే పారాబెన్లు, థాలేట్లు వంటి పదార్థాలను స్వల్పంగా ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం చూపే రసాయనాలుగా పరిగణిస్తున్నారుఉ. హెయిర్ డై ఎప్పుడు ఉపయోగించాలనే విషయంలో సమయం చాలా ముఖ్యమైనది. సాధారణంగా కీమోథెరపీ పూర్తయిన తర్వాత కనీసం ఆరు నెలల వరకు పర్మనెంట్ హెయిర్ డైకి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా పెరుగుతున్న జుట్టు బలపడటానికి, తల చర్మం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం అవసరం. తలకు నేరుగా రేడియేషన్ చికిత్స తీసుకుంటున్నవారు లేదా చికిత్స సమయంలో స్కాల్ప్ కూలింగ్ ఉపయోగిస్తున్నవారు వైద్య బృందం స్పష్టమైన అనుమతి ఇచ్చే వరకు హెయిర్ డైని పూర్తిగా నివారించడం మంచిది. చికిత్స పూర్తయిన మొదటి ఆరు నెలల్లో కెమికల్ హెయిర్ డైలకు దూరంగా ఉండి, తల చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. ఆరు నెలల తర్వాత కూడా డై వాడే ముందు వైద్యుడిని సంప్రదించి తల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పరిశీలించుకోవడం మంచిది. ఏదైనా హెయిర్ కలరింగ్ ఉత్పత్తిని ఉపయోగించే ముందు కనీసం 48 గంటల ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం కూడా అవసరం.
క్యాన్సర్ చికిత్స తర్వాత జుట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన హెన్నా, ఇండిగో, క్యాసియా వంటి సహజ మొక్కల పొడులతో తయారైన హెర్బల్ డైలను పరిగణించవచ్చు. అయితే ఇవి నిజంగా సహజమైనవేనా, వాటిలో సింథటిక్ పీపీడీ లేదా మెటాలిక్ సాల్ట్స్ వంటి అదనపు పదార్థాలు లేవా అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేని సెమీ పర్మనెంట్ కలరెంట్లు కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇవి సాధారణంగా జుట్టు ఉపరితలంపై రంగును జమ చేస్తాయి. త్వరగా గ్రే రూట్స్‌ను కవర్ చేయాలనుకునేవారు రూట్ పౌడర్లు లేదా కలర్ మస్కారాలను ఉపయోగించవచ్చు. ఇవి ఒక్కసారి షాంపూ చేసినప్పుడు తొలగిపోతాయి కాబట్టి ఎక్కువకాలం రసాయనాలకు గురికావాల్సిన అవసరం ఉండదు. హెయిర్ కలరింగ్ ఉత్పత్తిని ఉపయోగించే ముందు చెవి వెనుక భాగంలో లేదా మోచేయి లోపలి భాగంలో కొద్దిగా అప్లై చేసి 48 గంటల పాటు గమనించాలి. ఎర్రగా మారడం, దురద, వాపు, మంట వంటి లక్షణాలు కనిపిస్తే ఆ ఉత్పత్తిని ఉపయోగించకూడదు. సాధ్యమైనప్పుడు తల చర్మానికి నేరుగా డై తగలకుండా హైలైట్స్ లేదా బాలయాజ్ వంటి పద్ధతులను కూడా పరిగణించవచ్చు. క్యాన్సర్ చికిత్స తర్వాత సాధారణ హెయిర్ కేర్ రొటీన్‌కు తిరిగి రావడం ఒక సంతోషకరమైన దశే అయినప్పటికీ, తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లడం ముఖ్యం. ముఖ్యంగా పర్మనెంట్ హెయిర్ డై వాడే ముందు కనీసం ఆరు నెలలు వేచి ఉండటం, రసాయన రహిత లేదా సున్నితమైన ప్రత్యామ్నాయాలను పరిగణించడం, అలాగే చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్య బృందాన్ని సంప్రదించడం ద్వారా తల చర్మం, కొత్తగా పెరుగుతున్న జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.