జిన్నారం, ఏప్రిల్ 13: పలు పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యం వెదజల్లుతున్నా పీసీబీ, ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని, నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డపోతారంలోని అయ్యమ్మ చెరువు పరిరక్షణకు పీసీబీ, ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్య లు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ చెరువు పరిరక్షణపై సోమవారం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించా రు.
రసాయన పరిశ్రమల నుంచి వాయు, జల కాలుష్యం ఎక్కువై క్యాన్సర్, ఇతర రోగా ల బారిన పడుతున్నామని ప్రజలు, బాధితులు ఎమ్మెల్యేకు గోడు వెళ్లబోసుకున్నారు. కాలుష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గడ్డపోతారం, చెట్లపోతారం, అల్లీనగర్, కిష్టాయిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు సహకరించారన్నారు. కానీ, రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్య జలాలు, వాయువులను వదులుతూ ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. 14 పరిశ్రమలపై చర్యలకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
కాలుష్య కారక పరిశ్రమలపై తాము సైతం ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. అయ్య మ్మ చెరువును శుద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సమీక్షలో పీసీబీ ఈఈ కుమార్‌పాఠక్, ఇరిగేషన్ ఈఈ భీం, మున్సిపల్ చైర్మన్లు సుష్మ, జనార్దన్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామ య్య, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, వెంకటేశం గౌడ్, ప్రకాశ్‌చారి, రవీందర్ రెడ్డి, గణేశ్, నర్సింలు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.