– దూదిమెట్ల బాలరాజు యాదవ్
– కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన ఎన్ఎస్యూఐ నాయకులు
నల్లగొండ, ఆగస్టు 14 : అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని విశ్వసిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సమక్షంలో ఏకుల గణేష్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా దూదిమెట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ప్రజల పక్షాన నిలబడి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మళ్లీ ఆదరణ పెరుగుతోందని నకిరేకల్ లో గులాబీ జెండా ఎగురుతుందని బాలరాజు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
ఏకుల గణేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తమను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, వారి అనుచరుల రాజకీయ ఆగడాలు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తమకు ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, గ్రామ మాజీ సర్పంచ్ ఏకుల కవిత విజయకుమార్, మాజీ ఎంపిటిసి నాగిళ్ల వెంకటయ్య, నోముల సతీష్, కల్లేపల్లి వెంకన్న, చింతమల్ల వెంకన్న, కల్లపెల్లి గోవర్ధన్, కొండ భద్రయ్య, నోముల పాండు, దూదిమెట్ల భిక్షమయ్య, ఏకుల నరేశ్, దూదిమెట్ల లింగయ్య, కల్లేపల్లి మురళి, వెంకన్న పాల్గొన్నారు.