పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 16: ప్రజాభిప్రాయం మేరకే అమీన్పూర్ పరిధిలో ఎస్టీపీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. దీనిపై గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్చెరులోని ఏడు చెరువుల పరిధిలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ) ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు.
అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని సర్వేనంబర్ 993లోని 10 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో దుర్వాసన వస్తుందని, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కాలనీవాసులు తమ దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై ఈనెల 18న ఉదయం ప్లాంటు ఏర్పాటు చేయబోయే స్థలంలోనే సంబంధిత అధికారులు, కాలనీల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు పై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.