సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికే ప్రాచీన గుర్తింపుగా నిలిచిన అరుదైన వారసత్వ గుట్టలు, పర్యావరణ సంపదపై కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకీ గురిపెట్టింది. చారిత్రక స్పృహ, పర్యావరణ పరిరక్షణను పూర్తిగా పక్కనబెట్టి, వేల కోట్ల రూపాయల రాబడి కోసం ఏకంగా వందల ఏళ్ల చరిత్ర కలిగిన రాయదుర్గం, దుర్గం చెరువు పరిసరాల్లోని అరుదైన గుట్టలను వేలం వేసేందుకు టీజీఐఐసీ వేగంగా సన్నాహాలు చేస్తున్నది.
హెరిటేజ్ చట్టాలను బొందపెట్టి, పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేసేలా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఈ క్రమంలోనే రాయదుర్గం పాన్ మక్తా పరిధిలోని దాదాపు 11 ఎకరాల వారసత్వ గుట్టల వేలం వ్యవహారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేరింది. రాయదుర్గం పరిధిలోని వందల ఏళ్ల కిందటే అరుదైన రాతి నిర్మాణాలుగా ఉద్భవించాయి. వీటిని పరిరక్షించాల్సిన సర్కార్.. ఆగస్టు 17, 20 తేదీల్లో వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అంశం అటు పర్యావరణవేత్తలతోపాటు, ఇటు మానవ హక్కుల కార్యకర్తలు, నగరవాసులను కలవరపెడుతున్నది. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిన మహానగరంలో లంగ్ స్పేస్ లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి అరుదైన ప్రాంతాన్నీ కూడా నిర్వీర్యం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి వాదనల నేపథ్యంలో సర్కార్ భూముల వేలాన్ని ప్రముఖ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. హెరిటేజ్ రాక్స్ ధ్వంసమైతే మిగిలేది ఏ మి లేదని పేర్కొన్నారు. ఈ నెల 17, 20 తేదీల్లో జరిగే వేలా న్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన కమిషన్‌ను కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటివరకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీని నియమించలేదు. దీనికి హెచ్ఎండీఏ కమిషనర్ కీలక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ హెరిటేజ్ యాక్ట్, రెగ్యులేషన్ మార్గదర్శకాలు ఉన్నాప్పటికీ… కమిటీ నియామాకం చేయలేదు. అదేవిధంగా హెరిటేజ్ కమిటీ గుర్తించిన ప్రాంతాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నా… ముందస్తు అనుమతులు అనివార్యం. కానీ ఇక్కడ కమిటీ అనుమతులు లేకుండానే వేలానికి సిద్ధం చేయడం చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. భూమిపై ముందే వేలం హక్కులు సృష్టించి, ఆ తర్వాత చట్టబద్ధత కోసం వెతుక్కోవడం ప్రభుత్వ తుగ్లక్ చర్యలకు నిదర్శనమని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. వేలంలో అరుదైన తెలంగాణ భౌగోళిక సంపదను అంగడి సరుకు చేయవద్దంటున్నారు.
గతంలో ప్రభుత్వ భూములు, వర్సిటీ స్థలాలను, పర్యావరణ సున్నితమైన ప్రాంతాలపై దృష్టి సారించి, వేలం పేరుతో సొమ్ము చేసుకోవడమే పని పెట్టుకున్నది. గతంలో పర్యావరణ ప్రాంతంగా గుర్తింపు పొందిన కంచ గచ్చిబౌలి భూములను వేలానికి పెట్టి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఇక ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా వ్యాపార అవసరాల కోసం వినియోగించేందుకు వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేసింది. ఆతర్వాత ఇస్లామియా వర్సిటీ భూములపై కన్నేసిన సర్కార్.. న్యాయపరమైన సవాళ్లతో వెనుకడుగు వేసింది. ఇదే తరహాలో దుర్గం చెరువు పరిసరాల్లో ఉన్న అరుదైన రాతి సంపదను నిర్వీర్యం చేసేందుకు సిద్ధం కావడంతో మరోసారి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఈ వ్యవహారం చేరింది.
భవిష్యత్ ప్రణాళికలు లేకుండా, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికలన్నీ పర్యావరణ, జీవ వైవిధ్యానికి తీరని నష్టం చేసేలా ఉన్నాయి. ప్రకృతిని కాపాడాల్సిన ప్రభుత్వమే అభివృద్ధి పేరిట విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేయడంలో భాగంగానే గుట్టలు, అరుదైన రాళ్లను వేలానికి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. చారిత్రక, వారసత్వ నేపథ్యం ఉన్న ఈ తరహా ప్రాంతాన్నీ పరిరక్షించాల్సింది పోయి… కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చే ప్రయత్నాలను తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ పర్యావరణ విధ్వంసక చర్యలపై న్యాయస్థానాలు, మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు సామాజికవేత్తల బృందాలు పోరాడుతామంటూ స్పష్టం చేస్తున్నాయి.