తొగుట, జూలై 14: ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేసి వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లిలో ఎమ్మె ల్యే సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, వాటర్ క్యాన్లు, చెత్తబుట్టలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్సర్కారు తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండేవని, కూడవెల్లివాగు నిండుకుండలా ప్రవహించేదన్నారు. రామయంపేట, దుబ్బాక ప్రధాన కాల్వల ద్వారా చెరువులు, కుంటల్లో నీళ్లు నింపడం జరిగిందని గుర్తుచేశారు. కేసీఆర్ మీద కక్షకట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సాకుతో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నార్లుముదిరిపోతున్నా నాట్లు వేసే పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి వాగుతో పాటు దుబ్బాక, రామయంపేట ప్రధాన కాల్వల ద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను నింపాలన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మల్లన్నసాగర్,కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కింద చెరువు,కుంటలకు పూర్తిస్థాయిలో నీళ్లు పారించడానికి కాల్వలు ఏర్పాటు చేయాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కేసీఆర్ రైతుబంధు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తే రైతు భరోసా ద్వారా రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇంతవరకు ఇవ్వడం లేదని ఆరోపిం చారు. పెట్టుబడుల సమయంలో ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. నాడు రేవంత్‌రెడ్డి కోసం పనిచేసిన నిరుద్యోగులు నేడు నిజం తెలుసుకొని పోరాటం చేస్తున్నారన్నా రు.
అనంతరం ఇటీవల పిడుగుపాటు గుర్తె మరణించిన కడారి శ్రీశైలం కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు చిలువేరి మాల్లారెడ్డి, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్‌కుమార్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిలువేరి రాజిరెడ్డి, తగరం ఆశోక్, చెరుకు లక్ష్మారెడ్డి, నాయకులు రమేశ్, మంగ నర్సింహులు, యాదగిరి, వెంకట్‌రెడ్డి, నందరామ్ నరేందర్‌గౌడ్, చిక్కుడు రమేశ్, స్వామిగౌడ్, రాములు, సూతారి రాంబాబు, యెన్నం కొండల్‌రెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు.