సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జనవరి 18: యాసంగికి సాగు నీళ్లు లేక ఆందోళన పడుతున్న రైతులను చూసి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్వయంగా కలిసి లేఖ అందించారు. అయినా స్పందించకపోతే మరోసారి ఫోన్లో విన్నవించారు. ఈ మేరకు మంత్రి అధికారులతో చర్చించి రంగనాయకసాగర్‌లోకి అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక పంపు ద్వారా గురువారం నీటిని పంపింగ్ చేశారు. మూడు రోజుల పాటు రంగనాయక సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేయనున్నారు. యాసంగికి త్వరలో కాల్వల ద్వారా నీళ్లు అందనున్నాయి. నీటి పంపింగ్ చేయించిన మంత్రి ఉత్తమ్‌కు రైతుల పక్షాన ఎమ్మెల్యే హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి మూడేండ్లుగా రంగనాయక సాగర్ ద్వారా యాసంగి పంటకు నీళ్లు ఇచ్చారు. ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి రాగా.. వెంటనే రంగనాయక సాగర్‌లోకి నీళ్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రికి స్వయంగా లేఖ రాశారు. అయినా స్పందించక పోవడంతో మరోసారి రైతుల పక్షాన ఫోన్లో విజ్ఞప్తి చేశారు. దీంతో రంగయనాయక సాగర్‌లోకి నీళ్లు పంపింగ్ చేశారు. తన్నీరు హరీశ్‌రావు కృషి ఫలితం.. రైతుల పక్షాన పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నీళ్లు వచ్చాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన్నీరు హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.