తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజలు పండుగ వాతావరణం ఉట్టిపడాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై పటన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో మాణిక్‌రావు, అందోల్‌లో క్రాంతికిరణ్‌తో పాటు పలుచోట్ల ప్రజాప్రతిధుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22 వరకు రోజుకో కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
– సంగారెడ్డి/ మెదక్, న్యూస్‌నెట్‌వర్క్, మే30
సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు
సంగారెడ్డి కలెక్టరేట్, మే 30: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో విద్యాశాఖ, సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో విద్యా శాఖలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.
విద్యా దినోత్సవం రోజున మన ఊరు – మనబడి కింద పనులు పూర్తయిన పాఠశాలల ప్రారంభోత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్, ఏడీ విజయ, డీసీఈబీ కార్యదర్శి, ప్రిన్సిపాల్స్, రీజినల్ కో ఆర్డినేటర్స్, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.