కంది, నవంబర్ 26: బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ప్రాధాన్యమిచ్చామని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం బేగంపేటలో సంఘ సేవకుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాయిగౌడ్ సొంత ఖర్చుతో మహిళా సంఘాల భవనానికి కావాల్సిన ఫర్నిచర్ కొనుగోలు చేసి మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సంఘాల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
బేగంపేట గ్రామాన్ని పంచాయతీగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మహిళా సంఘ భవన నిర్మాణం తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.