KTR | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. మార్చి 13,14 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ‘ఇండియా టుడే కాన్క్లేవ్’ సదస్సులో ప్రసంగించాలని ఆహ్వానిస్తూ ఇండియా టుడే గ్రూప్ చైర్పర్సన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లీ పూరీ శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.
మారుతున్న భారతదేశ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంపై కేటీఆర్ తన విశ్లేషణను పంచుకోవాలని ఇండియా టుడే గ్రూప్ కోరింది. తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడంలో, తెలంగాణకు సాంకేతికత, స్టార్టప్‌లకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో సందర్భోచితంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా ప్రపంచ గమనాన్ని అంచనావేస్తూ, కీలక అంశాలపై చర్చించే వేదికగా ఈ కాన్క్లేక్ గుర్తింపు పొందిందని తెలిపారు. భిన్నమైన ఆలోచనలు, స్వేచ్ఛాయుతమైన చర్చలు, సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుందని వివరించారు.
ఈ వేదికపై ప్రసంగించిన ప్రపంచస్థాయి దిగ్గజాల సరసన కేటీఆర్ చేరనున్నారు. ఇప్పటివరకు ఈ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాంటి దేశాధినేతలతోపాటు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గీతాగోపీనాథ్ లాంటి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు ప్రసంగించారు.