ముంబై: విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక మహిళా నిరసనకారిని పోలీస్ అధికారి అసభ్యకరంగా తాకాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ అధికారి ప్రవర్తనను పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థించింది. (Cop Gropes Woman Protester) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. దాదర్ ప్రాంతంలో విద్యార్థుల నిరసన సందర్భంగా సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ అధికారి ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను అభ్యంతరకర రీతిలో పట్టుకుని లాక్కెళ్లాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఆ పోలీస్ అధికారి ప్రవర్తనను తప్పుపట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ పోస్ట్‌లో డిమాండ్ చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు దీనిని ట్యాగ్ చేశారు.
మరోవైపు ముంబై పోలీస్ శాఖ ఆ అధికారికి అండగా నిలిచింది. వీడియోలో కనిపించే పోలీస్ అధికారి ఒక పురుష నిరసనకారుడిని పక్కకు లాగుతుండగా, ఆ మహిళ వారి మధ్యలోకి వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆ అధికారి వేరే వైపు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ అధికారులు ఆ వీడియోను పరిశీలించారని, ఆ అధికారి ప్రవర్తనలో ఎలాంటి తప్పు లేదని వారు అభిప్రాయపడినట్లు ఎక్స్ పోస్ట్‌లో బదులిచ్చారు.
అయితే పోలీస్ అధికారి అనుచిత ప్రవర్తనకు సంబంధించిన పూర్తి వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఆ మహిళను పట్టుకుని లాగుతున్నప్పుడు ఆయన స్పష్టంగా ఆమె వైపే చూశాడు. అలాగే ఆ మహిళ ముందు భాగంపై ఉంచిన తన చేతిని వెనక్కి తీయకపోగా అలాగే ఉంచాడు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి ప్రవర్తనను ముంబై పోలీస్ విభాగం సమర్థించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
What is this behaviour Mumbai Police? Why is a male cop mandhandling a young female protestor like this? Why isn’t he letting his female colleagues handle this? What action will be taken against him? This is unacceptable @Dev_Fadnavis pic.twitter.com/A37ZtRNMhp
— Indians (@voicesindians) July 24, 2026