సంగారెడ్డి, జూన్ 20: ఎన్నికల ముందు అమలుకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నదని సంగారెడ్డి ఎమ్మెల్యే చిం తా ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ అమలుకు సాధ్యంకాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా రైతాంగానికి రూ.2లక్షలు రుణమాఫీ చేయాలన్నారు.
వృద్ధు లు, వితంతువులతోపాటు అన్ని రకాల పింఛన్ల్లు డబుల్ చేసి పంపిణీ చేస్తామన్న హామీపై ప్రభుత్వానికి చలనం లేదని దుయ్యబట్టారు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్ష నూట పదహారుతోపాటు తులం బంగారం ఇస్తామని మొండిచేయి చూపడంతో ప్రభుత్వంపై మహిళలు అగ్రహంతో ఊగిపోతున్నారని స్పష్టం చేశారు. సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడం అలవాటేనన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయాన్ని అందిస్తే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎకరాకు రూ.15వేలకు పెంచి ఖాతాల్లో జమ చేస్తామన్నా మాటలు నీటి మూటలుగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ హయాంలో సాగు, తాగు నీటికి ఢోకాలేకుండా నిరంతరం కరెంట్ సరఫరా జరిగిందని, కరెంటు కోతలు లేకుండా 24గంటలూ సేద్యానికి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల కన్నా అధికంగా కాంగ్రెస్ ఇస్తదని ఆశతో ప్రజలు ఎన్నికల్లో పట్టం కడితే మోసం చేసి సొమ్మ చేసుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలోకి వచ్చాం అందినకాడికి దోచుకొని దాచుకోవడమే లక్ష్యమన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గోవద్ధన్నాయక్, నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, కల్వకుంట్ల నర్సింగ్‌రావు, జీవి శ్రీనివాస్, జలేందర్, సంతోశ్‌రెడ్డి, ముజీబ్, కసిని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.