అందోల్, ఏప్రిల్ 17 : తెలంగాణలో అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత లభిస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం అందోల్ మండలంలోని సంగుపేట ఒక ఫంక్షన్హాల్లో అందోల్, పుల్కల్, చౌటకూర్, టేక్మాల్ మండలాలకు చెందిన ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముసి్ంల, మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. మైనార్టీ పాఠశాలలు నెలకొల్పి ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి పెండ్లి చేసి అత్తారింటికి సాగనంపి, బిడ్డకు పురుడు పోసి తల్లీబిడ్డలను ఆరోగ్యంగా ఇంటికి చేర్చుతున్నదని, ఇదీ దేశంలో ఎక్కడా లేదన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ కిట్టుతో పాటు కొత్తగా న్యూట్రిషన్ కిట్లను సైతం అందజేస్తున్నామన్నారు. ప్రతి పథకాన్ని ఆడబిడ్డల పేరుతోనే ప్రవేశ పెడుతున్నారని, ఆడపిల్లలు అన్ని రంగాల్లో నిలదొక్కుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ జర్నలిస్టు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఎంపీపీ బాలయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు లింగాగౌడ్, మాజీ ఎంపీపీ రామాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు మల్లికార్జున్, నాగభూషణం, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్, నాయబ్ తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.