మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 26: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెలకొంది. తాగునీటి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధూళిమిట్ట గ్రామ పంచాయతీ పరిధిలో 667 నివాసాలు ఉండగా 3500 జనాభా ఉంది. వీరికి తాగునీటిని సరఫరా చేసేందుకు గ్రామంలో మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు మూడు 5హెచ్‌పీ బోరు మోటర్లు, నాలుగు వన్ హెచ్‌పీ బోరుమోటర్లు ఉన్నాయి.
రెండేండ్ల క్రితం వరకు మిషన్ భగీరథ నీరు సమృద్ధిగా రావడంతో గ్రామంలో తాగునీటి సమస్య అనేది ఉత్పన్నం కాలేదు. ఇటీవల మిషన్ భగీరథ నీరు అరకొరగా గ్రామానికి వస్తుండడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లు వస్తే ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిండే అవకాశం ఉంటుంది. సరిపడా భగీరథ నీళ్లు రాకపోవడంతో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిండని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు మిషన్ భగీరథ పైపులైన్లో రాళ్లు, చెత్త పేరుకుపోవడంతో తాగునీటి సమస్య మరింత జఠిలమైంది. తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన మిషన్ భగీరథ గ్రిడ్, ఇన్ట్రా అధికారులు పట్టించుకోవడం లేదు.
ధూళిమిట్ట గ్రామంలోని బీడీ కాలనీ, పాత బస్టాండ్ ఏరియాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రెండేళ్లుగా ఈ ఏరియాలోని జనాలకు తాగునీరు సరిగ్గా అందిన దాఖలాలు లేవు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు కంటితుడుపు చర్యగా వాటర్ ట్యాంకర్ల సహాయంతో వారం రోజులుగా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక దశలో గ్రామంలోని వాటర్ ట్యాంకర్‌కు తోడు పొరుగు గ్రామమైన తోర్నాల గ్రామానికి చెందిన వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు.
బీడీ కాలనీలో సొసైటీ గౌడౌన్ సమీపంలో పైపులైన్ దెబ్బతినడంతో ఆఏరియాకు చెందిన పలువురు కొంత డబ్బులు జమ చేసి పైపులైన్‌కు మరమ్మతులు చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ధూళిమిట్టలోనే తాగునీటికి కటకట ఏర్పడితే మండంలోని మిగతా గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉందో అంచనా వేయవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ధూళిమిట్ట గ్రామంలో ఏర్పడిన తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తామని గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
బీడీ కాలనీకి ఏడాది నుంచి నీళ్లు వస్తలేవు. కాలనీలో బోరు పాడైనా మరమ్మతు చేయించడం లేదు. తలాకొన్ని డబ్బు లు వేసుకొని బోరుమోటర్‌కు మరమ్మతులు చేయించాం. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి బోరు మోటర్‌కు మరమ్మతు చేయించాలని అడిగితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. మమ్ముల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
– ఆహ్మదిబేగం, బీడీ కాలనీ, ధూళిమిట్ట, సిద్దిపేట జిల్లా
రెండేండ్ల నుంచి తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. మమ్ముల్ని ఎవరూ పట్టించుకోలేదు. మా కాలనీలో ఉన్న బోరు మోటర్ నాలు గుసార్లు కాలిపోయింది. మేమే పైసలు వేసుకొని మరమ్మతు లు చేయించుకున్నాం. నీళ్ల కోసం పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలే. నీళ్లు లేక అరిగోస పడుతున్నాం.దయచేసి మాకు సరిపడా నీళ్లు వచ్చేటట్లు అధికారులు చూడాలే.
-మలిగ నర్సమ్మ, ధూళిమిట్ట, సిద్దిపేట జిల్లా
నీళ్లు అసలే వస్తలేవు. నా కాళ్లు విరిగిపోయాయి. కొడుకు, కోడలు చనిపోయారు. నీళ్లు తెచ్చేటోళ్లు ఎవరూ లేరు. ఇంటి ముందట నీళ్లు వచ్చినప్పడు నాలుగు బిందెలు పట్టుకొని ఎళ్లదీసుకునేది. ఇప్పుడు నాలుగు రోజులకు ఒకసారి కూడా నీళ్లు వస్తలేవు. నీళ్లు లేకపోతే మేము ఎట్లా బతికేది. జర తాగునీళ్లు వచ్చేటట్లు చూడుండ్రి. మునుపెప్పుడూ నీళ్ల కోసం ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడేమో నీళ్లకు చాలా ఇబ్బందులు పడుతున్నాం.
-తాడూరి నర్సయ్య, ధూళిమిట్ట, సిద్దిపేట జిల్లా