మెదక్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్/ సిద్దిపేట కలెక్టరేట్: పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుం డా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలు అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి వివి ధ జిల్లాల కలెక్ట్టర్లు, అటవీశాఖ అధికారులు, ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..పోడు భూముల్లో సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, క్రమశిక్షణ చర్యలకు గురికావద్దని సూచించారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ, అటవీశాఖ భూములు కాపాడి విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతున్నదన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏండ్లుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను గుర్తిం చి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో చర్చించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అట వీ ప్రాంతంలో చెట్లు నరికితే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజనులకు అటవీశాఖ వ్యతిరేకం కాదు అనే భావన తొలిగించేలా అధికారులు పని చేయాలని సూచించారు.
మెద క్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పోడు భూముల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్ అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో జోజి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, సంక్షేమ శాఖ అధికారి అఖిలేశ్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి తదితరులు పాల్గొన్నారు.