‘దేశం మొత్తంలో గృహావసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.. అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో సోమవారం కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. పాపన్నపేట మండలం రామతీర్థంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఏడుపాయల్లో నూతనంగా నిర్మించిన యాగశాలను మంత్రి ప్రారంభించారు. మెదక్ పట్టణంలో జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి, ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేసి, డీసీసీబీ బ్యాంకును ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీఆర్టీయూ సంఘం దశాబ్ది ఉత్సవాలు, విద్యుత్ విజయోత్సవ సభ, ముదిరాజ్‌ల బహిరంగ సభలో పాల్గొన్నారు. సురక్షా దినోత్సవంలో భాగంగా పోలీస్ వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో కరెంట్‌కోతలతో పరిశ్రమలు మూతపడేవని, పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యారన్నారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి అందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. మిషన్ భగీరథను కాపీ కొట్టి కేంద్రం ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెదక్‌లో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 16 నుంచి అన్ని దవాఖానల్లో న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
– మెదక్, (నమస్తే తెలంగాణ)/ మెదక్ అర్బన్/ మెదక్ రూరల్/ పాపన్నపేట, జూన్ 5
మెదక్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వాల హయాంలో నాలుగు గంటల కరెంటు ఉండేదని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్‌లో విద్యుత్ ప్రగతిపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాభం పొందని ఒక మనిషి కూడా లేడని ఒక సందర్భంలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకేమి ఇచ్చారు చెప్పు అని అడిగారు.. అప్పుడు రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే కాదా అని చెప్పాను. అప్పుడు అవునని అంగీకరించిన పరిస్థితి అని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాల వల్ల పరిశ్రమలు మూతపడడంతోపాటు కార్మికులు ఇబ్బంది పడేవారని, తినడానికి తిండి ఉండని పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటలు కరెంటు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వమేనని పేరొన్నారు. అన్ని రంగాలకూ, అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అయ్యారు కాబట్టే మెదక్ జిల్లా ఏర్పడిందని, ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం మెదక్‌లోనే ఉండడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ కష్టపడి మెదడును కరిగిస్తే ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రజలకు ఇవ్వగలుగుతున్నామని అన్నారు. విద్యుత్ పంపిణీని బలోపేతం చేసేందుకు రూ.39వేల కోట్లను సీఎం కేసీఆర్ వెచ్చించారని, అందుకే నేడు ఫ్రిడ్జ్‌లు కాలడం లేదని, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదని అన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ పాత రోజులు తిరిగి వస్తాయన్నారు.
కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ జానకిరాం, డీఈ కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్‌చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశంలో ఏ ప్రభుత్వమూ ఉచిత కరెంటు ఇవ్వలేదు : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
దేశంలో ఏ ప్రభుత్వమూ ఉచిత కరెంటు ఇవ్వలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే వైర్లపై బట్టలు ఆరేసుకుంటారా అని సమైక్యవాదులు హేళన చేశారని, సమైక్య రాష్ట్రంలో రైతాంగం అనేక అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. బోర్లు వేసి అనేక మంది రైతులు అప్పులపాలయ్యారని దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా, కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏండ్ల పాలనలో ఏమిచేశారని ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మెదక్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావు ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్‌తోనే విద్యుత్ రంగం బలోపేతం : ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
విద్యుత్ రంగ బలోపేతం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. 1984లో విద్యుదాఘాతంతో హవేళీఘణాపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామంలో కురుమ దుర్గయ్య చనిపోయిన విషయం తెలుసుకొని అప్పటి మంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా గ్రామంలో సందర్శించారు. అప్పుడు శేరి సుభాష్‌రెడ్డి సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా 150 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మండలానికి ఒక సబ్ స్టేషన్ ఉండేది అని, 33 కేవీ ఒక ట్రాన్స్ఫార్మర్కి 30 నుంచి 50 బోరు కనెక్షన్లు ఉండేవన్నారు. విద్యుత్ సరిపోక మోటర్లు కాలిపోతుండేవన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మండలంలో 5 సబ్ స్టేషన్ల చొప్పున ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించి 24 గంటలూ ఉచిత కరెంటును ప్రజలకు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దకుతుందన్నారు.
విద్యుత్ రంగంలో అద్భుతాలు : మెదక్ కలెక్టర్ రాజర్షిషా
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక అద్భుతాలు సృష్టించిందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలకు కూడానిరంతరం విద్యుత్‌ను అందిస్తున్నారని తెలిపారు.